ఐదు నెలల గర్భిణి.. ఆమె కాలు తూలితేనే చూసిన వారి గుండెలు జారుతాయి. అలాంటిది ఆమైపె ఓ నలుగురు కర్కశంగా రాడ్డులతో దాడి చేశారు. నిలువునా అనుమానపు భూతం ఆవహించిన భర్త.. మృగంలా మారి దగ్గరుండి మరీ ఈ మారణ హోమం జరిపించాడు. వేగంగా పరిగెత్తి పారిపోలేని ఆమె అశక్తతను అదనుగా తీసుకుని కనికరం లేకుండా కొట్టి చంపేశారు. నమ్మి వెనక వెళ్తే ఉసురు తీశాడు.
కవిటి : ప్రేమించి.. పెద్దలను ఒప్పించి అదే ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. వివాహమై ఐదేళ్లు అయ్యింది.. అన్యోన్య దాంపత్యానికి మూడేళ్లు పాప జన్మించింది. రెండేళ్లుగా ఏమైందో ఏమో.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈలోగా భార్య గర్భం దాల్చింది.. తనకు పుట్టబోయే సంతానంపైనా అనుమానం కలిగి భార్యపై విపరీత ద్వేషం పెంచుకున్నాడు..ఎలాగైనా అంతమొందించాలని పథకం రచించాడు.. మరో ముగ్గురి సహకారంతో భార్యను గర్భిణి అని కూడా చూడకుండా దారుణంగా హతమార్చాడు. కవిటి మండలం అర్.కరాపాడు గ్రామానికి చెందిన కొంతాల మీనాక్షి భర్త దిలీప్ కుమార్ కర్కశత్వానికి బలైంది. దీనికి సంబంధించి ఇచ్ఛాపురం పోలీసులు కేసును శుక్రవారం ఛేదించారు. దిలీప్‌కుమార్‌తో పాటు హత్యలో పాలుపంచుకున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరించారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ వి.వి.అప్పారావు ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు.
రూ. 3.50 లక్షలకు కిరాయి..
ఆర్.కరాపాడులోనే ఎలక్ట్రీషియన్‌గా ఉన్న దిలీప్‌కు అదే గ్రామానికి చెందిన మీనాక్షితోనే 2020 జులై 29న ప్రేమ వివాహమైంది. రెండేళ్లుగా భార్య మీనాక్షిపై అనుమానం పెంచుకున్న దిలీప్ కుమార్ గర్భిణి అని కూడా ఆలోచించకుండా చంపాలని మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం పాత్రాపుర్ బ్లాక్ కేశరపడకు చెందిన మెట్టూరు రవికి రూ. 3.50 లక్షల కిరాయికి మాట్లాడాడు. ఇతను స్వతహాగా ఆటో డ్రైవర్ కావడం, పందుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. ఇదే వ్యాపారం చేస్తున్న విశాఖపట్నం అరిలోవ కాలనీ దుర్గా బజారుకు చెందిన వనము దాసుతో వ్యాపార పరిచయముండటంతో అతనిని ఒప్పించగలిగాడు. కవిటి మండలం జాడుపూడిలో ఖాళీగా తిరుగుతున్న తోట భానుప్రసాద్‌ను కూడా హత్యలో పాలుపంచుకునేలా పురమాయించారు.
ఎలా హత్య చేశారంటే..
మీనాక్షిని వైద్యపరీక్షల నిమిత్తం భర్త దిలీప్‌కుమార్ మార్చి 28న సోంపేట వెళ్లారు. తిరుగు పయనంలో రాత్రి 8.30 గంటలకు ఆర్.కరాపాడు రైల్వేగేటు దగ్గరకు వచ్చేసరికి కొంతమంది దుండగులు భర్త ఉంటుండగానే కిరాకతకంగా దాడి చేసిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన వెంటనే భర్త దిలీప్ కుమార్ పరారవ్వడం, ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయుడు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించడం, దర్యాప్తు ప్రారంభించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా పథకం ప్రకారం దారి దోపిడీలా చిత్రీకరించాలనుకున్నారు. ఆటో, ద్విచక్రవాహనాలపై ఆర్.కరాపాడు గేటు వద్ద దారిలో కాపుకాచారు. అప్పటికే ద్విచక్రవాహనంపై భార్య మీనాక్షితో కలిసి వస్తున్న దిలీప్ బండి ఆపేయడంతో ముందుగా భానుప్రసాద్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో దాడి చేయడం, ఆ తర్వాత మిగతా ఇద్దరూ పిడిగుద్దులు గుద్దడం ఆరంభించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి చేర్చినట్టు నటించి భర్త అక్కడి నుంచి పరారయ్యారు. అనుకున్న ఒప్పందం ప్రకారం మెట్టూరు రవికి భార్యను చంపాక దిలీప్‌కుమార్ రూ. 2.50 లక్షలు ఇచ్చాడని, రూ. లక్ష ఇవ్వలేదని విచారణలో తెలిసింది. ఈ మేరకు నిందితుల నుంచి ఐరన్‌రాడ్, రెండు ద్విచక్రవాహనాలు, గోల్డ్ చైన్, నాలుగు మొబైళ్లు స్వాధీనం పోలీసులు చేసుకున్నారని డీఎస్పీ వివరించారు.
కిరాయి ఇచ్చి గర్భిణిని చంపించిన భర్త
ముగ్గురితో రూ.3.50 లక్షలకు ఒప్పందం
కేసును ఛేదించిన ఇచ్ఛాపురం పోలీసులు
భర్తతో సహా నలుగురికి రిమాండ్


