ఆమదాలవలస: భారత తపాలా శాఖ జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన (లేఖా రచన) పోటీల్లో ఆమదాలవలస శ్రీవాణి విద్యానికేతన్‌లో 8వ తరగతి చదువుతున్న ఇ.కావ్యశ్రీ విజేతగా నిలిచింది. పోస్ట్ కార్డు, ఇన్‌ల్యాండ్ లెటర్, ఎన్వలప్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించింది. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక పాఠశాలలో తల్లిదండ్రుల సమక్షంలో శ్రీకాకుళం హెడ్ పోస్టాఫీసు సూపరింటెండెంట్ వండాన హరిబాబు రూ.25,000 చెక్‌ను అందజేశారు. సుమారు ఎనిమిది వేల మంది పాల్గొన్న ఈ పోటీల్లో కావ్యశ్రీ విజేతగా నిలవడం జిల్లాకు దక్కిన గౌరవమని సూపరింటెండెంట్ అభినందించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థుల సమక్షంలో బహుమతి అందుకోవడం ఆనందంగా ఉందని కాశ్యశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా కావ్యశ్రీకి శిక్షణ ఇచ్చిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కె.వి.రాజారావును పాఠశాల డైరెక్టర్ బి.వెంకటేశ్వర్లు, బి.నారాయణమూర్తి, విశ్రాంత ఎంఈఓ ఎస్.వి.రమణ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు సంపత్, ప్రణవి, తరుణ్, ఇందుమతి, హరిబాబు, అప్పలనాయుడు, పోస్టల్ శాఖ స్టెనో పూజారి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ బిల్లు అడ్డుకోకపోవడం దారుణం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లింలకు అండగా ఉంటామని మభ్యపెట్టి ఓట్లు దండుకొని ఇప్పుడు వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు కావాల్సిన బలం ఉన్నా అడ్డుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జోనల్ ఇన్‌చార్జి ఎంఏ రఫీ, జిల్లా అధ్యక్షులు ఎం.ఎ.బేగ్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టం అమలుకు బాహాటంగా మద్దతిచ్చి పూర్తిస్థాయిలో బిల్లును పాస్ చేయడానికి చంద్రబాబు ప్రత్యక్ష కారణమయ్యారని ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 13లో ఉన్న ముస్లింల పరిరక్షణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని దుయ్యబట్టారు. దేశ సౌభాగ్యానికి ప్రతీకలమని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు నష్టపరిచే ప్రక్రియకు చేయి కలపడం సరికాదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఎస్.అమానుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్, పట్టణ అధ్యక్షుడు అబూబకర్, ఉపాధ్యక్షుడు సర్ఫరాజ్ భయ్యా, జహంగీర్, అజ్గర్, అలీబేగ్, సయ్యద్ రషీద్, ఎంఏ సిరాజుద్దీన్, బహదూర్ జానీ, కేఎస్ మదీనా పాల్గొన్నారు.
రూ.10 లక్షల విలువైన చెట్లు దగ్ధం
ఆమదాలవలస: మండలంలోని లొద్దలపేటలో పూజారి శ్రీలత అనే రైతు తోటలో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో 200 శ్రీగంధం చెట్లు, 200 సర్వీ చెట్లు, కొన్ని మామిడి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు వాపోయారు. భర్త ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నందున ఆమదాలవలసలో నివాసం ఉంటున్నామని, ఊరిలో తాము లేని సందర్భం చూసుకొని దుండగులు నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని కోరారు.
బెల్లం క్రషర్ షెడ్ దగ్ధం
ఆమదాలవలస: మండలంలో చేపేనపేటలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో బుడితి సాంబమూర్తికి చెందిన బెల్లం క్రషర్ షెడ్ కాలిపోయింది. పక్కనున్న పొలంలో పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. షెడ్‌తో పాటు బెల్లం తయారీలో ఉపయోగించే ఇనుప పెనాలు, క్రషర్ ఇంజన్ దగ్ధమైందని, సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఆమదాలవలస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతగా కావ్యశ్రీ
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతగా కావ్యశ్రీ
రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతగా కావ్యశ్రీ


