గార: మండలంలోని వాడాడ పంచాయతీ యాబాజీఖాన్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం వాడాడకు చెందిన కొందరు వ్యక్తులు చెరువులోని గొయ్యిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. మృతదేహం ఎండిన స్థితిలో కనిపించడంతో వెంటనే సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ ఆర్.జనార్దనరావు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంతో తనిఖీలు జరిపించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, నలుపు నిక్కరు, జేబులో ఖైనీ ప్యాకెట్, నోటు, చిల్లర పైసలు ఉన్నాయని చెప్పారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


