ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆశావర్కర్ల వేతనాలు పెంచాలని, ఒప్పంద జీవోలు అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి డి.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి 20 ఏళ్లయిన సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో ‘ఆశా వర్కర్లు సాధించిన విజయాలు –సవాళ్లు’ అనే అంశంపై సదస్సు జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, పోస్టులను రెగ్యులర్ చేయాలని, చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూని టీ హెల్త్ వర్కర్స్‌ను ఆశా కార్యకర్తలుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులతో పలాస, సంతబొమ్మాళిలో ఆశా కార్యకర్తల తొలగింపులను జిల్లాలో అడ్డుకోవడం జరిగిందన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం కార్మికులకు రక్షణగా ఉన్న 44 లేబర్ కోడ్లను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్పు తీసుకురావడం కార్మికుల మెడకు ఉరితాడువంటిదన్నారు. మే 20న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం యావత్తు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కె.నాగమణి, ప్రధాన కార్యదర్శి జి.అమరావతి, నాయకులు పి.జయలక్ష్మి, లావణ్య, రాకోటి సుజా త, పార్వతి, సుధ, స్వర్ణలతా పట్నాయక్, అన్నపూర్ణ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.


