దళిత, గిరిజనుల భూముల ఆక్రమణ తగదు
● సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ
పాతపట్నం: దళిత, గిరిజనుల భూములను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ఆరోపించారు. మంగళవారం పాతపట్నం తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిజనులతో కలిసి ధర్నా నిర్వంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతపట్నం మండలం పాశీగంగుపేట గ్రామ రెవెన్యూ పరిధిలోని భూములను 40 ఏళ్ల క్రితం నక్సలైట్ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించిన దూసి అప్పలస్వామికి, ఇద్దరు ఆర్మీ ఉద్యోగులకు, మరో ముగ్గురు దళిత, గిరిజన కుటుంబాలకు 4.50 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూములు పక్కనే ఎమ్మెల్యే స్థలాలు కొనుగోలు కోనుగోలు చేశారని చెప్పారు. ఇప్పుడు పక్కన భూములు కూడా ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయడం తగదన్నారు. అనంతరం డీటీ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు, సీపీఐ పాతపట్నం నాయకులు ఆచారి ఆదినారాయణ, త్రినాథ్, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు డి.శారద, బాధిత గిరిజన రైతులు దూసి భాస్కరరావు, ముడిదాన శివ, బిడ్డక భాస్కర్, తాలాడ రావనమ్మ, దుక్క చిన్నావాడు పాల్గొన్నారు.
పత్రాలు ఉంటే వెనక్కిచ్చేస్తా..
ఈ విషయమై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ ల్యాండ్ సీలింగ్ భూములైతే వెనక్కి ఇచ్చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. 2012లో ఈ భూములు కొనుగోలు చేశానని, అందులో ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నట్టు తనకు తెలియదని చెప్పారు. అమ్మిన వ్యక్తులు చెప్పలేదని, అవి నిజంగా ల్యాండ్ సీలింగ్ భూములైతే, వాటికి సంబంధించి పత్రాలు ఉంటే..ఆ భూములు వారికి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనకు భూములు అమ్మిన వారితో వ్యవహారం తేల్చుకుంటానని స్పష్టం చేశారు.


