ఐటీడీఏపై కూటమి నేతల హామీలు ఏమయ్యాయి?
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గిరిజన గ్రామాలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం దారుణమని, తాము అధికారంలోకి వస్తే ఐటీడీఏ తప్పక ఏర్పాటుచేస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి నేడు పట్టించుకోకపోవడం దారుణమని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కో–చైర్మన్ డాక్టర్ మీడియం బాబూరావు అన్నారు. జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, జీసీసీ ద్వారా కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. విభజిత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1.50 లక్షల మంది ఆదీవాసీలు జీవిస్తున్నారని, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సీతంపేట ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉండేదని, ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం కావడంతో శ్రీకాకుళం గిరిజనులకు ఐటీడీఏ లేకుండా పోయిందన్నారు. గత నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో స్వయంగ రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శ్రీకాకుళం జిల్లాలో నూతన ఐటీడీఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తగదన్నారు. ఆదివాసీలు నివసిస్తున్న ఒక్క గ్రామం కూడా షెడ్యూల్ ఏరియాలో లేకపోవడంతో ఆదివాసీల భూమి, అడవులకు రక్షణ లేకుండాపోయిందన్నారు. బూర్జ మండలంలో అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, శ్రీకాకుళం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొంతు అప్పారావు, ఎన్.అప్పన్న, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సవర పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


