పశువుల పట్టివేత
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నారాయణవలస సమీపంలో వ్యాన్‌లో 13 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు కోటబొమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను ఆపగా 12 మగదూడలు, ఒక ఆవు ఉన్నట్లు గుర్తించి వాటిని విజయనగరం జిల్లా కొత్తవలస గోశాలకు తరలించారు. అనంతరం ఆవులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు.
కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని వినతి
సారవకోట: జిల్లాలోని గిరిజన పాఠశాలలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సీతంపేట ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ మేరకు సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో కలిసి సమస్యలను వివరించారు. గిరిజన పంచాయతీలలో ఆరోగ్య ఉప కేంద్రాలు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బైరిసింగి లక్ష్మినారాయణ, అడవి రాముడు, చౌదరి లక్ష్మినారాయణ, కొచ్చ శ్రీను, సింహాచలం పాల్గొన్నారు.
పురుగుమందు తాగి
వృద్ధురాలి ఆత్మహత్య
రణస్థలం: మండలంలోని వెంకటరావుపేటకు చెందిన కొత్తకోట సత్యం(59) అనే వృద్ధురాలు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యం మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో గడ్డిమందు తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గమనించి రణస్థలం సీహెచ్‌సీకి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి భర్త ఎల్లయ్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైవేపై అక్రమ వసూళ్లు!
ఇచ్ఛాపురం టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని బెల్లుపడ సమీపంలో పాత టోల్‌గేటు వద్ద అనధికార వ్యక్తులు వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరుతో అక్రమ వసూళ్ల దందా సాగిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పేరిట రసీదు బుక్ చూపించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఇంటిగ్రేడ్ చెక్‌పోస్టు ఉన్నప్పుడు అక్రమంగా వస్తువులు రవాణా చేస్తే వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేసేవారు. ఇంటిగ్రేడ్ చెక్‌పోస్టు తొలగించాక అపరాధ రుసుం వసూలు చేయడం ఆగిపోయింది. ప్రస్తుతం మార్కెట్ కమిటీలో కొందరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, తోటపని చేసే వారు హైవేపై వ్యవసాయ ఉత్పత్తుల లారీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికులు, అధికారులు వచ్చే సమయంలో ఏమీ తెలియనట్లు పక్కకు జారుకుంటున్నారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఆంద్రయ్య వద్ద ప్రస్తావించగా గతంలో కవిటి మండలం కరాపాడు టోల్‌గేటు వద్ద లారీలు ఆపి వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసే లారీల నుంచి పన్ను వసూలు జరిగేదని, టోల్ గేట్ వారు అభ్యంతరం చెప్పడంతో పాత టోల్‌గేటు వద్దకు మార్చామని చెప్పారు.సూపర్‌వైజర్లు, ఇతర అధికారులే పన్ను వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పెన్షనర్ల సమస్యలపై వినతి
శ్రీకాకుళం అర్బన్: పెన్షనర్‌ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ పాలంకి, ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చౌదరి పురుషోత్తమనాయుడు, జనరల్ సెక్రటరీ సతీష్‌కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాష్ట్ర సెక్రటేరియేట్‌లో కలిసి వినతిపత్రం అందించారు.
పశువుల పట్టివేత


