రెడ్‌క్రాస్ మూర్తి ఇక లేరు
● నేత్రాలను సేకరించిన
ప్రతినిధులు
శ్రీకాకుళం కల్చరల్: సి.వి.నాగజ్యోతి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకుడు, రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు సి.వెంకట నర్సింహమూర్తి(82) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్ వద్ద సీవీ నాగజ్యోతి ఆనంద నిలయం(వృద్ధాశ్రమం) నిర్మాణ దాతగా, అనేక దేవాలయాల అభివృద్దికి విరాళాలు అందించిన మూర్తి కొంతకాలంగా వృద్ధాశ్రమంలోనే ఉంటున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేసిన మూర్తి తన జీవిత చరమాంకంలో కుమార్తె నాగజ్యోతి పేరిట చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మందికి భోజనం పెట్టారు. ఆయన మృతి పట్ల రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సభ్యులు మల్లా చక్రవర్తి, దుర్గా శ్రీనివాసరావు, తదితరులు విచారం వ్యక్తం చేశారు. ఆయన నేత్రాలను రెడ్‌క్రాస్ ప్రతినిధులు సేకరించారు.


