ఈవీఎం గోదాముల తనిఖీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై మాసాంతపు తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి కె.విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా వ్యవస్థలు, సిబ్బంది విధులు, హాజరును సమీక్షించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హాజరై భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ పట్ల నమ్మకం కలిగేందుకు ఇటువంటి తనిఖీలు అవసరమని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎన్నికల విభాగాధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


