ఒకేసారి మూడు ఉద్యోగాలు
సంతబొమ్మాళి: మండలంలోని ఆర్.హెచ్.పురం గ్రామానికి చెందిన యారబాటి మోహన్‌రావు ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల విడుదలైన బ్యాంకింగ్ ఫలితాలలో యూనియన్ బ్యాంక్ ఎల్‌బీవో (లోకల్ బ్యాంక్ ఆఫీసర్), సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో క్లర్క్, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఎంపికై శభాష్ అనిపించాడు. మోహన్‌రావు చిన్నతనంలోనే తండ్రి కృష్ణారావు మరణించగా, తల్లి కాశమ్మ పెంపకంలో మేనమామ హేమసుందర్ సహకారంతో పట్టుదలతో ఉన్నత విద్య అభ్యసించాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. తాజాగా ఒకేసారి మూడు కొలువులు సాధించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను యూనియన్ బ్యాంక్ ఎల్‌బీవోగా జాయినింగ్ అవుతానని మోహన్‌రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు.


