22న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అరసవల్లి: జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు ఈ నెల 22న నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజా పేర్కొ న్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 22వ తేదీ మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు స్థాయీ సంఘాల సమావేశం ప్రారంభం అవుతాయన్నారు. ఉదయం 10.30కు 2, 4, 1, 7 స్థాయీ, మధ్యాహ్నం 3 గంటలకు 6వ స్థాయీ, 4 గంటల 3వ స్థాయీ, సాయంత్రం 5 గంటలకు 5వ స్థాయీ సంఘాల సమావేశాలు జరగనున్నట్లు ఆ ప్రకటనలో వివరించారు.
10.5 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి తమిళనాడుకు 10.5కిలోల గంజాయిని తరలిస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన నరేష్ సేతి, డి.గోపీనాథ్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ చిన్నమనాయుడు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో నివాసం ఉంటూ గంజాయి వ్యాపారం చేసే లారెన్స్ ప్రధాన్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వడంతో వీరు ఇక్కడి నుంచి గంజాయి తీసుకెళ్తున్నట్లు తెలిసిందన్నారు. ఒడిశాలో గంజాయి కొని ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా పట్టణ పోలీసుల తనిఖీల్లో దొరికారని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్‌ఐ ఎం.ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు.


