అధికార పార్టీ నాయకుల భూ దాహం
● ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారు ● ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి ● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
పాతపట్నం: పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల భూ దాహం పెరిగిపోతోందని వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురా లు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి శనివారం ఆరోపించారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలేం రెవెన్యూ పరిధి అటవీ శాఖతో పాటు సమీపంలో ఉన్న కొత్త చెరువు భూముల ఆక్రమణలను శనివారం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానిక నాయకులతో కలసి పరిశీలించారు. భూముల ఆక్రమణతో పాటు విలువైన టేకుచెట్లు మాయం, అటవీ భూముల నుంచి అక్రమంగా తరలించుకుపోతున్న కంకర తవ్వకాలపై తహసీల్దార్ ఎస్.కిరణ్ కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ పాతపట్నం మండలం ప్రహరాజపాలేం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 7లోని సుమారు రెండు ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి, సర్వే నంబర్ 18లో ఉన్న కొత్త చెరువు గర్భాన్ని టీడీపీ నాయకులు ఆక్రమించుకుని ఇళ్ల స్థలాల ప్లాట్‌లు వేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భూముల ఆక్రమణతో పాటు టేకు చెట్లను, కంకరను స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నాయకులు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఆక్రమణలపై స్పందించకపోతే సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ అధికారుల్లో చలనం లేకుంటే జాతీయ కమిషన్‌కు సమస్యను తెలియజేస్తామన్నారు. ఆమెతో పాటు వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, సీనియర్ నాయకులు బి.నారాయణమూర్తి, పణుకు మోహన్, సత్య బిస్వాల్, టంకాల సుధాకర్, జీవ, వంశీ తదితరులు ఉన్నారు.


