ఉపాధి వేతనాలు తక్షణమే చెల్లించాలి
పాతపట్నం: ఉపాధి హామీ పథకం వేతనదారులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర తూర్పుకాపు కుల విభాగం అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పాతపట్నంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనవరి నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయల్లో వేతనాలు చెల్లించాల్సి ఉందన్నారు. పని ప్రదేశంలో కూలీలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. మండుటెండలో కూలీలు శ్రమిస్తున్నా కనీసం నీటిని కూడా సరఫరా చేయకపోవడం దారుణమన్నారు. టెంట్లు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలన్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో సరైన సమ యంలో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో గణపతి ప్రధాన్, పాడి అప్పారావు, పడాల రంజీత్, ఎన్ని తిరుపతి, శ్రీనివాసరావు, డిల్లేశ్వరరావు, నాగరాజు, మద్ది నారాయణరెడ్డి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


