వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
● శ్రీకాకుళం మండల పరిధిలో బైరి గ్రామంలో ఘటన ● ముక్తకంఠంతో ఖండించిన వైఎస్సార్‌సీపీ నాయకులు ● దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్
శ్రీకాకుళం రూరల్:
శ్రీకాకుళం మండల పరిధిలోని బైరి గ్రామం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి తర్వాత పగులగొట్టి రోడ్డుకు అడ్డంగా పడేశారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వీసు రోడ్డులో బైరి గ్రామానికి వెళ్లే రహదారిలో ఈ విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత కొన్ని నెలల కిందట విగ్రహం ఎడమ చేతిని కూడా గుర్తు తెలియని వారు ధ్వంసం చేశారు. ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే కూల్చేశారు. దీనిపై బైరి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ఎండి అసిరినాయుడుతో పాటు పలువురు గ్రామస్తులు రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనను వైఎస్సార్‌సీపీ నాయ కులంతా ముక్తకంఠంతో ఖండించారు. జనం గుండెల్లో సుస్థిర స్థానం పొందిన వైఎస్సార్ విగ్రహంపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.
●విగ్రహం కూల్చివేత పైశాచికం
బైరి జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేయడం పైశాచికం. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి, చట్టపరంగా శిక్షించాలి. 108, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో వైఎస్సార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. పార్టీలకు అతీతంగా కోట్లాది మంది మదిలో ఆయన శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహాన్ని నేలపాలు చేయటం బాధాకరం. రాజకీయ పార్టీలు ఇలాంటి అనైతిక చర్యలను ముక్తకంఠంతో ఖండించాలి.
– తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం


