
థర్మల్ వ్యతిరేక పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు
ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలోని బూర్జ, సరుబుజ్జిలి మండలాల పరిధిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించనున్న థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆదివారం ఆమదాలవలసలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2030 నాటికి 50 శాతం థర్మల్ పవర్ ప్రాజెక్టులను మూసివేస్తామని, 2050 నాటికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులను మూసివేస్తామని తీర్మానం చేశాయని గుర్తు చేశారు. ఈ తరుణంలో రాష్ట్రంలో శివారు జిల్లా శ్రీకాకుళంలో రూ.30 వేల కోట్లతో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడడం విడ్డూరంగా ఉంన్నారు. అవసరమైతే సీఎం సొంత నియోజకవర్గంలో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటుతో ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, సీతంపేట, పాలకొండ, సంతకవిటి, శ్రీకాకుళం రూరల్‌తో కలిపి తొమ్మిది మండలాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ప్రజల శ్రేయస్సు, భావితరాల మనుగడ దృష్ట్యా ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రాణత్యాగాలకై నా సిద్ధమని ప్రకటించారు. గతంలో జెన్కో పేరుతో భూములు సేకరించి విశాఖపట్నంలో హిందూజా కంపెనీకి, రాజమండ్రి వద్ద జీవీకే కంపెనీకి కారుచౌకగా భూములు కట్టబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు.
● వెన్నెలవలస థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో అక్కడ సేకరించిన భూములు, ప్లాంట్ నుంచి వచ్చే బూడిదతో వ్యాపారం చేసి వాటిని కాజేయడానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముందస్తు ప్రణాళిక చేస్తున్నారని ఆరోపించారు. వెన్నెవలసలో కూన రవి పేరిట 50 ఎకరాలు, ఆయన సతీమణి పేరిట 50 ఎకరాలు 10 ఏళ్ల లీజుకు తీసుకునేందుకు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారని, ఆ స్థలంలో కూనవారిపూలతోట పేరుతో తోటలు పెంపకం చేసేందుకు సిద్ధమయ్యారని గుర్తుచేశారు. అప్పుడే ఆ భూములపై కూన రవికుమార్ కన్ను పడిందన్నారు. ఇపుప్పడు పవర్ ప్లాంట్ పేరుతో మళ్లీ ఆ భూములు నొక్కేసేందుకు, ప్లాంట్ తయారైతే దాని నుంచి వచ్చే బూడిదతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
● థర్మల్ పవర్ ప్లాంట్‌కు నాలుగు టీఎంసీల నీరు అవసరమని, అదే నాలుగు టీఎంసీల నీటితో 50వేల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయవచ్చని తెలిపారు. ప్లాంట్ పేరుతో ఆ ప్రాంతంలో గిరిజనులకు బతుకు తెరువు లేకుండా చేయడం సమంజసంకాదన్నారు. అనంతరం ప్లాంట్ ముప్పుకు సంబంధించిన అన్ని పత్రాలను విడుదల చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సరుబుజ్జలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, ఆమదాలవలస పట్టణ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, వివిధ విభాగాల కార్యవర్గ సభ్యులు దుంపల శ్యామలరావు, గురుగుబెల్లి శ్రీనివాసరావు, కూన రామకృష్ణ, దన్నాన అజయ్‌కుమార్, మామిడి రమేష్, చిగురుపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేశమంతా వ్యతిరేకిస్తుంటే ఆమదాలవలసలో ఎందుకు?
సీఎం సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవచ్చుకదా..
విలేకరుల సమావేశంలో పార్టీ
సమన్వయకర్త చింతాడ రవికుమార్