
వీడని గ్రహణం
పెండింగ్‌లో బిల్లులు..
● ఎక్కడకక్కడ నిలిచిపోయిన భవన నిర్మాణాలు
● పట్టించుకోని కూటమి పాలకులు
నరసన్నపేట: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్ని విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు గ్రహణం పట్టింది. ఎక్కడ చూసినా అసంపూర్తి నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. సచివాలయ భవనాలు, రైతుభరోసా కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు సొంత భవనాలు ఉండాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా భవనాలు నిర్మించేందుకు అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో భవనం నిర్మించేందుకు రూ.21 లక్షలు మంజూరు చేసింది. అదే వేగంతో వీటి నిర్మాణానికి స్థలాలు సేకరణ కూడా అధికారులు పూర్తి చేశారు. భవనాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేపట్టారు. కొన్ని వినియోగంలోనికి వచ్చాయి. మరికొన్ని పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని అధికారులు ఆలోశిస్తున్న సమయంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో పనులు నిలిచిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ భవనాలకు ‘చంద్ర’ గ్రహణం పట్టింది. ఎక్కడికక్కడ భవనాల నిర్మాణం నిలిచిపోయాయి. ప్రారంభమైన భవనాలు సక్రమంగా వినియోగంలో ఉండగా.. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న భవనాలు గ్రామాల్లో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇంత వరకూ వెచ్చించిన ప్రభుత్వ ధనం వృథా అవుతోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 594 విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్)లకు భవనాలు నిర్మాణం చేపట్టారు. భవనాలు అన్నీ ఒకేలా ఉండేవిధంగా ప్రత్యేకమైన డిజైన్ రూపొందించారు. వీటిలో 175 భవనాలు నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. వివిధ దశల్లో 348 నిర్మాణంలో ఉన్నాయి. 71 చోట్ల పనులు ప్రారంభం కాలేదు. అయితే వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న భవనాల్లో అనేకం చివరి దశలో ఉన్నాయి. వీటన్నీంటికి తుది మెరుగులు దిద్దితే వినియోగంలోకి వస్తాయి. అయితే ప్రభుత్వం కక్ష ధోరణితో వ్యవహరిస్తూ వీటిని పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా చోట్ల విలేజ్ హెల్త్ క్లినిక్‌లు పరాయి పంచన నిర్వహిస్తున్నారు. చాలీచాలని వసతులతో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు అరకొర సేవలు అందుతున్నాయి. కొన్ని చోట్ల సచివాలయాల్లోనే మందులు ఉంచి వచ్చిన రోగులకు సేవలు అందిస్తున్నారు. కాగా నరసన్నపేట నియోజకవర్గంలో 74 భవనాలు మంజూరు కాగా 26 పూర్తయ్యాయి. మిగిలిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.
మరో వైపు పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన మేరకు ఇంజినీరింగ్ సిబ్బంది బిల్లులు అప్‌లోడ్ చేశారు. ఈ మేరకు డబ్బులు వస్తాయనే సరికి ప్రభుత్వం మారడంతో బిల్లులు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా రూ.23 కోట్లు వరకూ బిల్లులు చెల్లించాల్సి ఉందని సమాచారం. బిల్లులు చెల్లిస్తున్నామని ఇంజినీర్లు చెబుతున్నా ఆ పరిస్థితి కనిపించడం లేదు. భవనాలు పూర్తయిన వాటికి కూడా ఫైనల్ బిల్లు కాలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాకోవడంతో అప్పుల పాలయ్యామని, వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కక్షధోరణి విడనాడి ఈ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయించాలని సర్వత్రా కోరుతున్నారు. అప్పుడే గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని వైద్య సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

వీడని గ్రహణం