
బైక్‌ను ఢీకొట్టి.. లారీ కిందకు దూసుకెళ్లి..
● జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారు
● ముగ్గురికి తీవ్ర గాయాలు
నరసన్నపేట : దేవాది కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నరసన్నపేట వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని తోసుకుంటూ ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం లారీ కిందకు వెళ్లి నుజ్జు కాగా.. కారు ముందు భాగం సైతం లారీ కిందకు దూసుకుపోయింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న తలసముద్రం గ్రామానికి చెందిన శ్రీను, వెనుక కూర్చుకున్న సంతోషిలకు తీవ్ర గాయాలయ్యాయి. సంతోషి పరిస్థితి విషమంగా ఉంది. కారు కిష్టుపురం నుంచి వస్తుండగా డ్రైవింగ్ సీట్లో దుర్గారావు ఉన్నారు. ఈయనకు స్వల్ప గాయాలయ్యాయి. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను ఎన్‌హెచ్ అంబులెన్స్, 108 వాహనాల్లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.