
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
శ్రీకాకుళం రూరల్: యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ రజనీ పిలుపునిచ్చారు. మునసబుపేటలోని గాయత్రీ కాలేఫ్ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో గురజాడ విద్యాసంస్థలు, విశ్వసాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం యువ కవితా మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా కొంత సమయం కళారంగానికి కేటాయించాలన్నారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.వి.జి.డి.బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు నాలుగు గోడల మధ్య నుంచే భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలన్నారు. విశ్వసాహితి కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షురాలు కె.రమావతి మాట్లాడుతూ యువతకు నాటి, నేటి సాహిత్యాన్ని పరిచయం చేసి వారితో రచనలు చేయించి విశ్వవేదికలపై పరిచయం చేయాలన్నారు. అనంతరం గజల్ శ్రీనివాస్ తన పాటలతో యువతను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో జంధ్యాల శరత్‌బాబు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.