
వ్యాపారస్తులు ముందుకు రావాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ధరలు తగ్గించేందుకు వ్యాపారస్తులు వాలంటీర్‌గా ముందుకు రావాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి స్వప్నదేవి కోరారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జీఎస్టీ ధరల తగ్గింపుపై వ్యాపారస్తులతో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మెడికల్, ఆటోమొబైల్స్, వ్యవసాయానికి సంబంధించి యంత్రాలు, ఎరువులు, ప్యాకింగ్ మెటీరియల్, హెల్త్ ఇన్సూరెన్స్‌పై తగ్గింపులు వలన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల వద్ద డబ్బులు ఉంటే మరింతగా వ్యాపారాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు షాపుల వద్ద పాత ధరలు, కొత్త ధరల బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఉన్న అనుమానాలను జీఎస్టీ నోడల్ అధికారి నివృత్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్ జీఎస్టీ అధికారి చంద్రకళ, కాశీబుగ్గ, నరసన్నపేట, ఆమదాలవలస అసిస్టెంట్ జీఎస్టీ అధికారులు, బంగారం వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్, హోటల్స్, కిరాణా, ఆటోమొబైల్స్, సిమెంటు తదితరులు వ్యాపారస్తులు పాల్గొన్నారు.