
1, 2 తేదీల్లో కిరణ దర్శనం
అరసవల్లి: అరుదైన అద్భుత దృశ్యానికి వేళ య్యింది. అక్టోబర్ 1, 2 తేదీల్లో అరసవల్లిలో ఆదిత్యుని మూలవిరాట్టుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అరుదైన అద్భుత దర్శనం కన్పించనుంది. సూర్యోదయ సమయాన సాక్షాత్కరించనున్న ఈ కిరణ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అరసవల్లి క్షేత్రానికి రానున్నారు. ఉత్తరాయణ, దక్షిణాయ న కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి పాదాలను నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి. రానున్న బుధ, గురువారాల్లో కన్పించనున్న ఈ అద్భుత దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు ఇప్పటికే చర్చించారు. దసరా సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఇబ్బంది లేకుండా, సూర్యకిరణాలకు అడ్డం రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా శంకరశర్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే కిరణ దర్శనం ఉంటుందన్నారు.