
30న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
గార: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సూచనలతో జిల్లాలోని అన్ని దళిత సంఘాలను సమన్వయం చేస్తూ, పార్టీ అనుబంధ విభాగాలతో నిరసన ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూర్చేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అన్ని విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.