
ఎవరొస్తారో..ఎప్పుడొస్తారో!
● రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో కొరవడుతున్న పర్యవేక్షణ
● సక్రమంగా అమలు కాని ఫేస్ అటెండెన్స్
శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో పర్యవేక్షణ కొరవడుతోంది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటర్ల సెలవులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ రెండేళ్లుగా అమలు చేస్తోంది. ప్రత్యేక యాప్ ద్వారా హాజరు వేయకుంటే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారు. ఈ హాజరును పరిశీలించి జీతాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. రిమ్స్ ఆసుపత్రిలో మాత్రం ఇది అస్సలు అమలు కావడం లేదు. దీనిని ఎవరు పరిశీలిస్తున్నారన్నది కూడా అంతుచిక్కడం లేదు. రాష్ట్రస్థాయిలో సైతం ఈ హాజరును పరిశీలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఓ అధికారి తరచూ అనధికారికంగా గైర్హాజరవుతున్నా ఫేస్ అటెండెన్స్ వేయకుండా నెల మొత్తానికి జీతాలు చెల్లించేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సైతం దీనిపై దృష్టి సారించకపోవడం గమనార్హం. రిమ్స్ లోని చాలామంది వైద్యులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో నిర్ణీత సమయానికంటే చాలా ముందుగానే వెళ్లిపోతున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారి సైతం నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లిపోవడం, సెలవులో ఉండటం జరుగుతుండడం వల్ల ప్రశ్నించే వారే లేకుండాపోతున్నారు. ఈ కారణంగానే గైర్హాజరవుతున్న అధికారిని సైతం అడగలేని పరిస్థితి నెలకొంది.
నవంబరు 11 నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఎన్‌టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో నవంబరు 11 నుంచి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవం–2025, సాహిత్య, సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు నిర్వహించాలని సన్నాహక కమిటీ ప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవనంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కమిటీ ఆదివారం సమావేశమైంది. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 100 ప్రచురణ సంస్థలు బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. 10 రోజుల పాటు సాహిత్య సభలు, పుస్తక పరిచయాలు, కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. సాంస్కృతిక వేదికపై జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే తప్పెటగుళ్లు, జముకుల పాట, కోలాటం, పగటి వేషాలు, నాటిక, డ్యాన్సులు, సంగీత ప్రదర్శనలు, ఏకపాత్రాభినయ ప్రదర్శనలు, సైన్స్‌ఫెయిర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, కవితలు, కథలు వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. సమావేశంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కన్వీనర్ కేతవరపుశ్రీనివాస్, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజయ్ శర్మ, అట్టాడ అప్పలనాయుడు, ఎల్.రామలింగస్వామి, యు.నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, కంచరాన భుజంగరావు, చింతాడ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం
అరసవల్లి/గార: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. దసరా సెలవులు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కుటుంబ సమేతంగా ఆదిత్యుని దర్శించుకున్నారు. ఈయన వెంట జిల్లా ఎస్పీ కె.మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.2,78, 800, విరాళాల రూపంలో రూ.66,718, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.05లక్షలు వరకు ఆదాయం లభించినట్లు ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు. ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని కూడా విజయనగరం ఎస్పీ దామోదర్ దర్శించుకున్నారు. ఈవో కె.నరసింహానాయుడు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందించారు. .

ఎవరొస్తారో..ఎప్పుడొస్తారో!