బయటపడుతున్న.. బంగారం బండారం! | - | Sakshi
Sakshi News home page

బయటపడుతున్న.. బంగారం బండారం!

Sep 29 2025 11:10 AM | Updated on Sep 29 2025 11:14 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

బంగారం వ్యాపారానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే నరసన్నపేటలో ఇటీవల కాలంలో పలు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఒక్క పేటకే పరిమితం కాకుండా.. జిల్లా అంతటా పలు షాపుల్లో అక్రమాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో ఆ మధ్య నకిలీ హాల్‌మార్క్‌ బంగారం పెద్ద ఎత్తున దొరికింది. ఇప్పుడేమో జీఎస్టీ అధికారుల దాడులతో జీరో వ్యాపారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్‌ ఎగ్గొట్టి వినియోగదారులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడిది నరసన్నపేటకే పరిమితం కాకుండా జిల్లా అంతటా నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాటల గారడీ..

ధర పెరిగినా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. తులం బంగారం రూ.లక్షా 25 వేలు దాటినా వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్‌ను కొందరు వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నా రు. ప్రజల్ని అమాయకులను చేసి బురిడీ కొట్టిస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పి బుట్టలోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటికొచ్చినవి కొన్నే. వెలుగులోకి రానివెన్నో. అలాగని అందరూ అలాంటి వారు కాదు. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి, వినియోగదారుల మన్ననలు, నమ్మకం పొందుతున్నారు.

దొంగ బంగారం ఆరోపణలు..

ఇప్పటికే దొంగతనం బంగారం, నాణ్యత తక్కువ ఉన్న ఆభరణాలు, ట్యాక్స్‌ చెల్లించని బంగారం విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది. గతంలో దొంగ బంగారాన్ని పోలీసులు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ రికవరీ చేశారు. 24 క్యారెట్‌ అని 22 క్యారెట్‌, 22 క్యారెట్‌ పేరిట 18 క్యారెట్‌ బంగారం ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. బిల్లులపై స్పష్టంగా రాయడం లేదని ఆ మధ్య ఒక అధికారి హెచ్చరించినట్టు తెలిసింది. మొత్తానికి మోసమనేది కొన్నిచోట్ల జరుగుతోంది.

జీరో వ్యాపారం..

మోసాలతో పాటు జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్టుగా తాజాగా జరిగిన జీఎస్టీ అధికారుల సోదాలతో తెలుస్తోంది. కోయంబత్తూరు, చైన్నె, ముంబై తదితర నగరాల నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని ఇక్కడ వినియోగదారులకు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఒక్క వినియోగదారులకే కాకుండా పలు షాపులకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ఆ జీఎస్టీ లెక్కలు ఎవరికీ అర్ధం కాకుండా వేస్తున్నారు. కొందరికై తే జీఎస్టీ లేకుండా బంగారం విక్రయిస్తున్నారు. జీఎస్టీ లేకుండా బంగారం కావాలంటే బిల్లులు ఉండవని చెప్పేస్తున్నారు. ఈ తరహా కొనుగోళ్లలోనే మోసాలు జరుగుతున్నాయి. బిల్లుల్లేని బంగారంలో మోసాలకు పాల్పడుతున్నారు. తిరిగి అమ్మేటప్పుడు నిలదీయాలంటే బిల్లులు ఉండాలి. అవి లేనప్పుడు వినియోగదారుడు ఏం అడగగలడని కొందరు వ్యాపారులు దగా చేస్తున్నారు. బయటపడుతున్న ఘటనలన్నీ నరసన్నపేటలో అయినప్పటికీ దాని లింకు జిల్లా వ్యాప్తంగా ఉందనే వాదనలు ఉన్నాయి. మొత్తానికి బంగారం విషయంలో జిల్లాకు చెడ్డ పేరు వస్తోంది. బంగారంలో నాణ్యత, లావాదేవీలు ఎంతవరకు కచ్చితమనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది.

బట్టబయలవుతున్న బంగారం మోసాలు

నరసన్నపేటకే పరిమితమా?

జిల్లా వ్యాప్తంగా ఇదే బాగోతమా?

మొన్న నకిలీ హాల్‌మార్క్‌ మోసం

తాజాగా జీఎస్టీ అధికారుల సోదాలతో వెలుగులోకి జీరో వ్యాపారం

చివరికీ మోసపోతున్నది వినియోగదారులే

నకిలీ హాల్‌మార్క్‌ మోసాలు..

ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్‌ మిషనరీతో నకిలీ హాల్‌మార్క్‌ వేసి బంగారం విక్రయిస్తున్నారు. ఆ నకిలీ హాల్‌మార్క్‌ బయటపడకుండా ఉండేందుకు నెట్‌లో ఉన్న వేరే వారి హెచ్‌యూఐడీ నంబర్లు వేస్తున్నారు. సాధారణంగా హెచ్‌ఐయూడీ నెంబర్‌ను గూగుల్‌ సెర్చ్‌ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి హెచ్‌ఐయూడీ నంబర్‌ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్‌తో హాల్‌మార్క్‌ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. ఆ మధ్య నరసన్నపేటలో ఇదే మోసం వెలుగుచూసింది. వాస్తవంగా ఈ రకమైన మోసం జిల్లాలో చాలాచోట్ల జరుగుతోందని సమాచారం. ఆకస్మిక తనిఖీల్లో అక్కడ బండారం బయటపడింది. దీంతో మనం కొనుగోలు చేస్తున్న బంగారంలో నాణ్యతెంతో ? అన్న అనుమానం వినియోగదారుల్లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement