సూర్యాపేట: జిల్లాలో ఆర్‌ఎంపీలు గుట్టుగా గర్భిణులకు అబార్షన్లు చేయిస్తూ దందా సాగిస్తున్నారు. రూ.30వేలు ఇస్తే లింగ నిర్ధారణ పరీక్ష చేసి ఆడపిల్ల అని తేలితే కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల సహాయంతో అబార్షనన్ చేయిస్తున్నారు. ఖమ్మం కేంద్రంగా జిల్లాలో సాగుతున్న ఈ దందాను ఇటీవల పోలీసులు బయటపెట్టారు. ఇప్పటికే కొంతమంది ఆర్‌ఎంపీలపై కేసులు నమోదు చేయగా మరికొంత మందిపై నిఘా పెట్టినట్లు సమాచారం.
కొంతమంది ఆర్‌ఎంపీలు గ్రూపుగా ఏర్పడి..
జిల్లాలో ఎక్కువగా ఆర్‌ఎంపీలు అబార్షన్లు చేయిస్తున్నారు. లింగ నిర్ధారణ చేసుకునే వారిలో ఎక్కువగా మగ బిడ్డ కావాలనుకునేవారు ఉంటున్నారు. మొదట ఆడపిల్ల పుట్టాక, మగ సంతానం కోసం లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలోని కొంతమంది ఆర్‌ఎంపీలు గ్రూపుగా ఏర్పడి ఖమ్మం జిల్లాలోని ఒక వ్యక్తితో కలిసి సూర్యాపేటలోని స్కానింగ్ సెంటర్లు, డాక్టర్లు, మెడికల్ షాప్స్ ద్వారా ఈ దందా నడిపిస్తున్నారు. ఇందులో స్కానింగ్ సెంటర్లు టెస్టులు చేసి ఆడ, మగ వివరాలు చెప్పడం ఒకటైతే.. డాక్టర్లు దొంగచాటున క్లీనిక్‌లో అబార్షన్లు చేయడం మరో అంశం. ఇవేమీ లేకుండా కొంతమంది ఆర్‌ఎంపీలే స్వయంగా ఇంటికి వచ్చి టాబ్లెట్ పద్ధతిలో అబార్షనన్ చేస్తున్నారు. ఒక్కో అబార్షనన్ కోసం రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు.
17 మంది పేర్లను బయటపెట్టగా..
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణులకు అబార్షన్ చేస్తుండగా డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆస్పత్రిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర ఆర్‌ఎంపీలదే అని తేల్చారు. మొత్తం 17 మంది పేర్లను బయటపెట్టగా వీరిలో 10 మంది ఆర్‌ఎంపీలే ఉండడం గమనార్హం. మరికొన్ని ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టిన పోలీసులు మరికొంత మందిని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల గర్భిణికి అబార్షనన్ చేసిన ఆస్పత్రిని సీజ్ చేశాం. స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచాం.
– డాక్టర్ కోటాచలం, డీఎంహెచ్‌ఓ
స్కానింగ్ సెంటర్లలో కోడ్ లాంగ్వేజ్..
కొన్ని స్కానింగ్ సెంటర్లలో పుట్టబోయే బిడ్డ మగ, ఆడ అని చెప్పే సమయంలో పట్టుపడకుండా కోడ్ లాంగ్వేజ్‌తో మేనేజ్ చేస్తున్నారు. గర్భిణులు మొదటగా ఆర్‌ఎంపీల వద్దకు రాగానే ఒంటరిగా స్కానింగ్ సెంటర్లకు తీసుకెళ్తారు. అక్కడ లోపలికి వెళ్లే ముందు మొబైల్ తీసుకురానివ్వరు. స్కానింగ్ చేశాక ఆడ పిల్ల అయితే పాప మంచిగా ఉందంటూ, బాబు అయితే అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నాడంటూ కోడ్ లాంగ్వేజ్‌లో చెప్తారు. జిల్లా కేంద్రంలోని ఒక స్కానింగ్ సెంటర్, కోదాడ, హుజూర్‌నగర్‌లో ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుండగా ఇప్పుడు ఖమ్మం నుంచి టెక్నీషియన్లు, పోర్టబుల్ అల్ట్రాసౌండ్ మిషన్‌న్ తీసుకొచ్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్కానింగ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment