మోదీ పాలనలో దేశం తిరోగమనం
భానుపురి (సూర్యాపేట): ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశం తిరోగమనం వైపు పయనిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శుక్రవారం సూర్యాపేటలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చేలా పాలన కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కక్షగట్టి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ కేంద్రమే పెత్తనం చేయాలని చూస్తోందన్నారు. పెరుగుతున్న ధరలను, నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా వైఫలమైందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్ సీట్ల సంఖ్యను కుదించే ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment