ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టులో పంటలు చేతికొచ్చే అవకాశం
మరో తడి నీటిని అందించాలి
మాకు నీరందడం ఆలస్యమైంది. దీంతో నాట్లు ఆలస్యంగా పడ్డాయి. మరో తడి నీటిని ఇస్తేనే పొలం చేతికి వస్తుంది. అధికారులు స్పందించి నీటి షెడ్యూల్‌ను మరో వారం, పదిరోజులు పొడిగించాలి. లేదంటే సగంపంట కూడా చేతికి రానట్లుంది.
– ధరావత్ చాంప్లా,లక్ష్మీనాయక్‌తండా, చివ్వెంల మండలం
ఇదే చివరి తడి
షెడ్యూల్ ప్రకారం జిల్లాకు ఇదే చివరి తడి. నీటి విడుదలను పొడిగించే అవకాశం లేదు. ఉన్నతాధికారులకు మాత్రం సమాచారం ఇచ్చాం. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతాంగానికి నీటి విడుదల ఉంటుంది.
– శివధర్మతేజ, ఎస్సారెస్పీ ఎస్‌ఈ
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాకు మరో 15 రోజుల పాటు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తేనే పంటలు పూర్తిస్థాయిలో చేతికి వచ్చే అవకాశముంది. ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టుకు వారబందీ విధానంలో నీటిని తక్కువ మొత్తంలో నీటిని వదులుతుండడంతో చాలామంది భూములు సాగు చేయలేదు. ప్రధాన కాలువల వెంట, వాటిని ఆనుకొని ఉన్న పొలాలకు సైతం ఆలస్యంగా నీరు అందడంతో కొంత వెనుకకు నాట్లు వేశారు. ప్రసుతం ఈ పొలాలు ఈతదశలో ఉన్నాయి. వీటికి మరో 15 రోజుల పాటు నీటిని అందిస్తేనే తాలు లేకుండా చేతికి వచ్చే అవకాశముంది. అయితే సోమవారంతో ప్రభుత్వం ప్రకటించిన నీటి షెడ్యూల్ ముగిసింది.
వారబందీ విధానంలో..
జిల్లాలో యాసంగి పంటల సాగునిమిత్తం ఎస్సారెస్పీ రెండోదశకు జనవరి 1న నీటిని విడుదల చేశారు. వారబందీ విధానంలో మార్చి 31వరకు ఆరు తడులకు ఇవ్వనున్నట్లు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో ఆత్మకూర్ మండలంలో 18వేలు, చివ్వెంలలో 15,200 , పెన్‌పహాడ్‌లో 9,456, సూర్యాపేటలో 10వేలు, జాజిరెడ్డిగూడెంలో 16వేలు, మద్దిరాలలో 8,653 , నాగారంలో 8వేలు, నూతనకల్‌లో 4,500 , తిరుమలగిరిలో 3,360 , తుంగతుర్తిలో 14,208 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో ఇప్పటికే 4వేలకు పైగా ఎకరాలు ఎండిపోయింది.
ఎండలు ముదిరి.. వాడకం పెరిగి..
జిల్లాలో బోరుబావుల కింద సాగైన వరి పొలాలు కొన్ని కోతదశకు వచ్చాయి. అక్కడక్కడ రైతులు కోతకోసి వడ్లను మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇక ఎస్సారెస్సీ ఆయకట్టుకు జనవరి 1నుంచి నీటి విడుదల చేయగా.. ఫిబ్రవరి వరకు కూడా కొందరు నాట్లు వేశారు. దీంతో కొన్ని పొలాలు ఈ తడితో బయటపడ నుండగా.. మరికొన్ని పొలాలకు మరో తడి కావాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఎండలు ముదిరి నీటి వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు విడుదల చేసే నీళ్లు చివరి వరకు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారంతో షెడ్యూల్ ముగియనుండడంతో చివరి తడిని అందించాలన్న తపనతో రైతులు కాలువ వద్దకు వచ్చి జగడాలు పెట్టుకోవాల్సి వస్తోంది.
ఫ జిల్లాకు సోమవారంతో ముగిసిన నీటి విడుదల గడువు
ఫ పలుచోట్ల నీళ్లను మళ్లించుకునేందుకు జగడాలు
ఫ ఆందోళనలో రైతాంగం
15 రోజులు నీళ్లిస్తేనే..


