ఎల్‌ఆర్‌ఎస్‌కు దూరం | - | Sakshi
Sakshi News home page

ఎల్‌ఆర్‌ఎస్‌కు దూరం

Mar 27 2025 2:09 AM | Updated on Mar 27 2025 2:09 AM

ఎల్‌ఆర్‌ఎస్‌కు దూరం

ఎల్‌ఆర్‌ఎస్‌కు దూరం

సూర్యాపేట : ఎల్‌ఆర్‌ఎస్‌(లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుములపై 25శాతం రాయితీ ఇచ్చినా ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరణ చేయించుకోవడానికి ముందుకురావడం లేదు. ప్రతి మున్సిపాలిటీలో వేలల్లో దరఖాస్తులు రాగా పరిష్కారం అవుతున్నవి వందల్లో ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65,153 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ఫీజు చెల్లించినవారి సంఖ్య 5.34శాతం మాత్రమే. ఈ నెలాఖరుతో ఫీజు రాయితీ గడువు ముగియనుంది.

ఐదు మున్సిపాలిటీల్లో 65,153 దరఖాస్తులు..

జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల కౌంటర్ల వద్ద బారులుదీరి రూ.1000 చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 2020 అక్టోబర్‌ 15 వరకే దరఖాస్తులు స్వీకరించి ఆపేశారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 65,153 దరఖాస్తులు వచ్చాయి. నాటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు ఆయా మున్సిపాలిటీల్లో వెబ్‌సైట్‌లో పెండింగ్‌లోనే ఉంటూ వచ్చాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ నెల 25వ తేదీ వరకు 3,480 దరఖాస్తులు మాత్రమే పరిశీలించి డాక్యుమెంట్లు, మార్కెట్‌ ధర ప్రకారం రుసుం తీసుకుని ఎల్‌ఆర్‌ఎస్‌ ధ్రువపత్రాలు జారీ చేశారు. వీటి ద్వారా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ద్వారా రూ.15.92కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా 61,673 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

అవగాహన కల్పించడంలో విఫలం

క్రమబద్ధీకరణ ఇంటి అనుమతి కోసమేనని, ఈ మాత్రం దానికి ఎస్‌ఆర్‌ఎస్‌ అవసరమేంటనే అపోహ చాలా మందిలో ఉంది. ప్లాట్లు క్రమబద్ధీకరించుకుంటే చట్టబద్ధత ఉంటుందని, అలాంటి వాటికే మార్కెట్లో విలువ పెరుగుతుందని, బ్యాంకులు ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇస్తాయన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఈ కోణంలో రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి.

నిషేధిత జాబితాలోని భూములకు వర్తించదు

మున్సిపల్‌ పరిధిలోని బఫర్‌, ఎఫ్‌టీఎల్‌, కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఒకవేిళ వీటి పరిధిలో భూములు ఉంటే గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్రమబద్ధీకరణ చేయకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌కు పూర్తి ఫీజు చెల్లించినా క్షేత్ర స్థాయి విచారణ అనంతరం తిరస్కరించడంతో పాటు చెల్లించిన ఫీజులో 10శాతం కట్‌ చేసుకొని మిగతా డబ్బులు మాత్రమే దరఖాస్తుదారులకు చెల్లిస్తారు.

అవకాశం సద్వినియోగం చేసుకోవాలి

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం గతంలో రూ.వెయ్యి చెల్లించిన వారు ఈనెల 31వ తేదీ లోపు ఫీజు చెల్లించి 25శాతం మినహాయింపు పొందాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు. వెబ్‌సైట్‌లో కూడా లాగిన్‌ అయి కూడా ఫీజు చెల్లించుకోవచ్చు.

– బి.శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట

అవగాహన లోపం.. క్రమబద్ధీకరణపై అనాసక్తి

ఫ ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు

ముందుకురాని యజమానులు

ఫ 65,153 దరఖాస్తుల్లో 3,480 మాత్రమే పరిష్కారం

ఫ 31వ తేదీతో ముగియనున్న 25శాతం రాయితీ గడువు

మున్సిపాలిటీ వచ్చిన పరిష్కారమైనవి ఆదాయం పెండింగ్‌

దరఖాస్తులు (రూ.కోట్లలో)

సూర్యాపేట 35,465 1845 9.30 33620

నేరేడుచర్ల 3131 79 0.26 3,052

హుజూర్‌నగర్‌ 4414 184 0.58 4,230

తిరుమలగిరి 6023 157 0.29 5,866

కోదాడ 16120 1215 5.49 14,905

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement