ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో నామినేష్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పలు పదవులకు వేసిన నామినేషన్లను కొందరు బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఉన్నవారి వివరాలను ఎన్నికల అధికారి గూడూరి శ్రీనివాస్ వెల్లడించారు. అధ్యక్ష పదవికి ఇద్దరు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, జాయింట్ సెక్రటరీకి ఇద్దరు, కోశాఽధికారికి ఇద్దరు, లైబ్రరీ సెక్రటరీకి ఇద్దరు, గేమ్స్ అండ్ కల్చరల్ పదవికి ఇద్దరు, ఈసీ సభ్యుల పదవులకు తొమ్మిది మంది పోటీలో ఉన్నట్లు వివరించారు. ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మఽఽధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలడించనున్నట్లు చెప్పారు.
మహిళలను వేధిస్తే
శిక్ష తప్పదు
సూర్యాపేటటౌన్ : మహిళలను వేధిస్తే శిక్ష తప్పదని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహిళా భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. మహిళలు, బాలలను ఎవరైనా వేధిస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. వేధింపులకు, దాడులకు గురైన వారికి భరోసా, ధైర్యం కల్పించాలన్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలను పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు.జిల్లాలో పని చేస్తున్న తీరును భరోసా సెంటర్ సిబ్బంది, షీ టీమ్స్ సిబ్బంది వివరించారు. ఎస్పీ వెంట భరోసా సెంటర్ ఎస్‌ఐ మౌనిక, షీ టీమ్స్ ఎస్‌ఐ నీలిమ, సిబ్బంది ఉన్నారు.
నేడు హుజూర్‌నగర్‌కు
మంత్రి ఉత్తమ్ రాక
హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం హుజూర్‌నగర్‌కు రానున్నారు. పట్టణ పరిధిలోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో ఉదయం 9 గంటలకు నిర్వహించే హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి మంత్రి హాజరవుతారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో నాయకులతో చర్చించనున్నట్లు మంత్రి పీఆర్‌ఓ వెంకట్‌రెడ్డి తెలిపారు.
వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలి
అర్వపల్లి: వేసవిలో మొక్కలు ఎండిపోకుండా నిర్వాహకులు తగు సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి కోరారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని రామన్నగూడెం వననర్సరీని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయని చెప్పారు. వర్షాలు పడ్డాక మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, బైరబోయిన నర్సయ్య పాల్గొన్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీనృసింహుని నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీస్వామివారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణతో కల్యాణ తంతు ముగించారు.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ


