
సాక్షి,చైన్నె : సీఎం ఎంకే స్టాలిన్ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌కు ప్రభుత్వం అధికారిక బంగ్లాను కేటాయించింది. గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న ఈ బంగ్లాను అధికారులు సుందరీకరిస్తున్నారు. వివరాలు.. చైన్నె ఆళ్వార్ పేట చిత్తరంజన్ రోడ్డులో తల్లిదండ్రులతో కలిసి ఉదయ నిధి స్టాలిన్ నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడే సీఎం క్యాంప్ కార్యాలయం సైతం ఉంది. నిత్యం సీఎంను కలిసేందుకు పలువురు ప్రముఖులు, అధికారులు వస్తుంటారు. అలాగే, ప్రస్తుతం సీఎం స్టాలిన్ వారసుడు ఉదయ నిధి మంత్రి కావడంతో ఆయన్ని కలిసేందుకు సైతం ప్రముఖుల రాక పెరిగింది.
దీంతో ఈ నివాసంలో రద్దీ పెరిగింది. ఈ దృష్ట్యా, ఉదయ నిధి కోసం మంత్రులకు కేటాయించే బంగ్లాను ప్రస్తుతం అధికారులు అప్పగించారు. గ్రీన్ వేస్ రోడ్డులో ఉదయ నిధికి ప్రత్యేకంగా బంగ్లా కేటాయించారు. దీంతో ఆయన తన మకాంను ఇక్కడ మార్చబోతున్నారు. మంత్రిగా ఇక్కడి నుంచి తన కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి.
ఈ బంగ్లాకు కురింజి అని గతంలోనే నామకరణం చేశారు. దీనిని గత నెలాఖరు వరకు స్పీకర్ అప్పావు ఉపయోగించారు. ఆయన మరో బంగ్లాకు మారడంతో ఉదయ నిధికి అప్పగించారు. అయితే. గతంలో స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఈ కురింజి బంగ్లా నుంచే తన వ్యవహారాలను పర్యవేక్షించే వారు. ప్రస్తుతం అదే బంగ్లా ఉదయ నిధికి అప్పగించడం గమనార్హం. ఈ బంగ్లా నుంచి రాజకీయ చక్రం తిప్పిన స్టాలిన్ ప్రస్తుతం సీఎం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment