Government Bungalow
-
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు
సాక్షి,చైన్నె : సీఎం ఎంకే స్టాలిన్ వారసుడు, మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌కు ప్రభుత్వం అధికారిక బంగ్లాను కేటాయించింది. గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న ఈ బంగ్లాను అధికారులు సుందరీకరిస్తున్నారు. వివరాలు.. చైన్నె ఆళ్వార్ పేట చిత్తరంజన్ రోడ్డులో తల్లిదండ్రులతో కలిసి ఉదయ నిధి స్టాలిన్ నివాసం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడే సీఎం క్యాంప్ కార్యాలయం సైతం ఉంది. నిత్యం సీఎంను కలిసేందుకు పలువురు ప్రముఖులు, అధికారులు వస్తుంటారు. అలాగే, ప్రస్తుతం సీఎం స్టాలిన్ వారసుడు ఉదయ నిధి మంత్రి కావడంతో ఆయన్ని కలిసేందుకు సైతం ప్రముఖుల రాక పెరిగింది. దీంతో ఈ నివాసంలో రద్దీ పెరిగింది. ఈ దృష్ట్యా, ఉదయ నిధి కోసం మంత్రులకు కేటాయించే బంగ్లాను ప్రస్తుతం అధికారులు అప్పగించారు. గ్రీన్ వేస్ రోడ్డులో ఉదయ నిధికి ప్రత్యేకంగా బంగ్లా కేటాయించారు. దీంతో ఆయన తన మకాంను ఇక్కడ మార్చబోతున్నారు. మంత్రిగా ఇక్కడి నుంచి తన కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ బంగ్లాకు కురింజి అని గతంలోనే నామకరణం చేశారు. దీనిని గత నెలాఖరు వరకు స్పీకర్ అప్పావు ఉపయోగించారు. ఆయన మరో బంగ్లాకు మారడంతో ఉదయ నిధికి అప్పగించారు. అయితే. గతంలో స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఈ కురింజి బంగ్లా నుంచే తన వ్యవహారాలను పర్యవేక్షించే వారు. ప్రస్తుతం అదే బంగ్లా ఉదయ నిధికి అప్పగించడం గమనార్హం. ఈ బంగ్లా నుంచి రాజకీయ చక్రం తిప్పిన స్టాలిన్ ప్రస్తుతం సీఎం అయ్యారు. -
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్టు 1 లోగా లోధి ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రియాంకకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక కొన్ని రోజుల పాటు గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆమె అద్దెకు తీసుకున్న నివాసంలో మరమ్మతు పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గురుగ్రాంకు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించాయి. ప్రియాంక నివాసం వద్ద సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చెక్‌ను చేపట్టినట్టు తెలిసింది. (బీజేపీ ఎంపీకి ప్రియాంక ఆహ్వానం) ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో నివసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే. -
బీజేపీ ఎంపీకి ప్రియాంక ఆహ్వానం
న్యూఢిల్లీ : తను నివసిస్తున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసే ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బీజేపీ ఎంపీ అనిల్ బలూనీని టీ కోసం ఆహ్వానించారు. ఈ మేరకు ఎంపీకి ఫోన్ చేయడంతోపాటు, ఆయన కార్యాలయానికి లేఖ కూడా పంపించారు. అయితే ప్రియాంక ఆహ్వానంపై అనిల్ బలూనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. నిర్ణీత సమయంలోపు ఇంటిని ఖాళీ చేసేందుకు ప్రియాంక సిద్ధంగా ఉన్నారని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు ప్రియాంక తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. (గురుగ్రాంకు ప్రియాంకా గాంధీ మకాం) ఇక ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోధీ స్టేట్ బంగ్లాలో నివసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని అనిల్ బలూనికి కేటాయించిన విషయం తెలిసిందే.. దీంతో ఎంపీని ఆయన భార్యతో సహా టీ కోసం ప్రియాంక గాంధీ ఆహ్వానించారు. (31 నుంచి అసెంబ్లీ పెట్టండి) -
గురుగ్రాంకు ప్రియాంకా గాంధీ మకాం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి హరియాణలోని గురుగ్రాంకు తాత్కాలికంగా మకాం మార్చనున్నారు. కొద్దినెలల పాటు ఆమె గురుగ్రాంలోని డీఎల్ఎఫ్ అరాలియా నివాసంలో ఉంటారని ప్రియాంక సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. ఢిల్లీలోని రెండుమూడు ప్రాంతాల్లో వసతి గృహం కోసం పరిశీలిస్తున్న ప్రియాంక త్వరలోనే అద్దె ఇంటిని ఖరారు చేస్తారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని సుజన్ సింగ్ పార్క్ ప్రాంతంలో ఓ ఇంటిని ఆమె ఎంచుకున్నారని మరమ్మతు పనులు పూర్తయినే వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లవచ్చని పేర్కొన్నాయి. అప్పటివరకూ గురుగ్రాంలో ప్రియాంక నివసిస్తారని తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గురుగ్రాంకు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని వెల్లడించాయి. ప్రియాంక నివాసం వద్ద సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ చెక్‌ను చేపట్టినట్టు తెలిసింది. కాగా ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను ఉపసంహరించడంతో ఢిల్లీలోని 35 లోధీ ఎస్టేట్ నుంచి ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆమెకు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నోటీసులపై ప్రియాంక స్పందిస్తూ జులై 31లోగా లోధీ ఎస్టేట్ నివాసాన్ని ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. చదవండి : పైలట్‌తో మంతనాలు.. రంగంలోకి ప్రియాంక -
సైకిల్ తొక్కి క్రికెట్ ఆడిన మాజీ సీఎం
లక్నో : సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రత్యేక బంగ్లా ఖాళీ చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం సామాన్య ప్రజలతో సరదాగా గడిపారు. ఈ రోజు ఉదయం గోమతి నది తీరంలోని వాకర్స్‌తో కలసి సైకిల్ తొక్కారు. అలాగే వారితో పాటు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత అక్కడి యువతతో కలసి క్రికెట్ ఆడారు. అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పుడు గోమతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా అఖిలేశ్‌తో అక్కడివారు దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సమాజ్‌వాదీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మరొకటైన జ్ఞానేశ్వర్ మిశ్రా పార్క్‌ను శనివారం సందర్శించిన అఖిలేశ్ ప్రభుత్వ సౌకర్యాలు శాశ్వతం కాదన్నారు. సుప్రీం కోర్టుపై గౌరవంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసినట్టు తెలిపారు. -
యోగికి ఎన్డీ తివారి భార్య లేఖ
డెహ్రాడూన్: యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారి భార్య ఉజ్వల, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాశారు. తాము ఇప్పుడు నివాసం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయడానికి కాస్త సమయం ఇవ్వాలంటూ లేఖలో ఆమె సీఎంను కోరారు. తివారి (92) ఆరోగ్యం బాగోలేదని అమె లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా తమ కుమారుడు రోహిత్ శేఖర్ కూడా అసుపత్రిలోనే ఉంటూ ఆయన్ని చూసుకుంటున్నారని.. ఈకారణాలతో ప్రస్తుతం నివాసం ఖాళీ చేయలేమని అమె తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా తివారీ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలను తక్షణమే ఖాళీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను మేరకు మే 17న యూపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలపై తమకు గౌరవం ఉందని పేర్కొన్న తివారీ భార్య, పరిస్థితుల నేపథ్యంలో కాస్త గడువు ఇవ్వాలని కోరారు. కాగా తివారి నాలుగు సార్లు యూపీ సీఎంగా, ఒకసారి ఉత్తరాఖండ్ సీఎంగా పని చేశారు. మరోపక్క తాము ఇప్పటికిప్పుడు బంగ్లాలు ఖాళీ చేయలేమని మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్‌లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. -
ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయం: మాజీ సీఎంలు
లక్నో: మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదని, వెంటనే వాటిని ఖాళీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. తాము ప్రస్తుతం ఉన్న బంగ్లా నుంచి ఖాళీ చేయలేమని, తమకు అదనపు నివాసలు లేవని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అఖిలేష్ యాదవ్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం లక్నోలో ప్రభుత్వం కేటాయించిన నివాసంలోనే ఉంటున్నారు. ప్రభుత్వ బంగ్లాలు 15రోజుల్లో ఖాళీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో మరో రెండేళ్ళు గడవు పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లక్నోలో జనాభా ఎక్కవగా ఉన్నారని, సెక్యూరిటీ సమస్య వల్ల వారికి కొత్త భవనాలు దొరకడం ప్రస్తుతం చాలా కష్టమని వారు లేఖలో పేర్కొన్నారు. అఖిలేష్ ప్రసుత్తం విక్రమాధిత్య రోడ్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలో ఉంటున్నారు. మాయవతి కూడా అదే రోడ్లో ఐదు ఎకరాల్లో రాజస్తాన్‌లో లభించే పింక్ మార్బుల్‌తో నిర్మించిన పది బెడ్రూమ్ల భవనంలో ఉంటున్నారు. -
మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రభుత్వ బంగ్లాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎస్సీ నేతలు ములాయం, అఖిలేష్‌తోపాటు మాయావతి, మరో ముగ్గురు మాజీ సీఎంలు తమ బంగ్లాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1981 స్థానిక చట్టం ప్రకారం పదవి నుంచి దిగిపోయాక 15 రోజుల్లో ఆ మాజీ సీఎం తన బంగ్లాను అప్పగించాల్సి ఉంటుంది. కానీ, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చట్ట సవరణ ద్వారా మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలోనే నివసించే వెసులుబాటును కలిపించారు. ఆ ఆదేశాలను అనుసరించి యూపీ మాజీ సీఎంలు అయిన ఎన్టీ తివారీ, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ములాయం, మాయావతి కుటుంబ సభ్యులు అధికారిక బంగ్లాలో నివసిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఆదేశాలపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ సవరణను కోర్టు తప్పుబట్టింది. ‘ప్రభుత్వ బంగ్లాలు ప్రజల ఆస్తులు, వాటిని దుర్వినియోగపరచటం రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధం. అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుంది’అని కోర్టు తెలిపింది. తక్షణమే బంగ్లాలను ఖాళీ చేయించి.. ఆ మాజీ సీఎంల నుంచి బకాయిలను వసూలు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్లు ఆదేశించింది. -
దెయ్యాలను వదిలారు.. అందుకే ఖాళీ చేశా!
పట్నా : ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన లాలూ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విచిత్రమైన వాదనను వినిపిస్తున్నాడు. ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయనే ఖాళీ చేశామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీలు నన్ను భవనం ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందుకే వాళ్లు అందులోకి దెయ్యాలను వదిలారు’ అంటూ తేజ్ పేర్కొన్నాడు. గతంలో నితీశ్ హయాంలో తేజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఈ బంగ్లాను కేటాయించారు. దేశ్‌రత్న మార్గ్‌లో ఉన్న ఈ భవనానికి వాస్తు దోషం మూలంగా అప్పుడు తేజ్ మార్పులు కూడా చేయించాడు. అయితే మహాకూటమితో విడిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్‌కు నితీశ్ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించటం.. అది సెంటిమెంట్‌గా భావించి తేజ్ ఖాళీ చేయలేదు. ఇంతలో ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఇలా ఉన్నపళంగా దెయ్యాలున్నాయంటూ భవనాన్ని ఖాళీ చేసేశాడు. అయితే ఇదంతా అతను చేస్తున్న జిమిక్కుగా జేడీయూ అభివర్ణిస్తోంది. అతని సోదరుడు తేజస్వి యాదవ్ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు. అందుకే మీడియా దృష్టిని తనవైపు మళ్లించుకోవటానికే దెయ్యాలంటూ తేజ్ ప్రతాప్ నాటకాలు ఆడుతున్నాడు అంటూ జేడీయూ నేతలు మండిపడుతున్నారు. -
అనధికారిక నివాసంపై 16 మంది మాజీ మంత్రులకు నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రభుత్వ బంగళాల్లో అనధికారికంగా నివాసముంటున్న 16 మంది కేంద్ర మాజీ మంత్రులకు నోటీసులు జారీ చేసినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. లోక్‌సభలో బుధవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు వెంకయ్య లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అనధికారికంగా నివాసముంటున్న మాజీ మంత్రులు జూలై 27 వరకు డ్యామేజీ చార్జీల కింద రూ. 20,92,463 చెల్లించాల్సి ఉంటుందన్నారు. టైపు-5 బంగళకు రూ. 53,250 నుంచి టైపు-3 బంగ్లాకు రూ.2,43,678 వరకు చార్జీలు ఉన్నట్టు తెలిపారు. అనధికారికంగా నివాసముంటున్న వారిలో మాజీ మంత్రులు కపిల్ సిబల్, అజిత్ సింగ్, ఫరూక్ అబ్దుల్లా, బేణీ ప్రసాద్‌వర్మ, పల్లంరాజు, బలరాం నాయక్, కిల్లి కృపారాణి, మానిక్రావ్ హోదయ్ గవిత్ ఉన్నారు. జనరల్ పూల్ కోటా కింద నివాసముంటున్న వారిలో ఎ.కె.ఆంటోనీ, ఆజాద్, మల్లికార్జున్ ఖర్గే, వీరప్పమొయిలీ, కె.చిరంజీవి, జేడీ శీలం తదితరులు ఉన్నారు. వీరికి ఖాళీ చేయడానికి 15 రోజుల గడువు ఇచ్చారు. కాగా, తనకు కేటాయించిన భవనాన్ని ఐదు రోజుల క్రితమే ఖాళీ చేశానని మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తెలిపారు.