దెయ్యాలను వదిలారు.. అందుకే ఖాళీ చేశా! | Lalu Son Claims Ghosts in Government Bungalow | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 22 2018 8:05 AM | Last Updated on Thu, Feb 22 2018 10:56 AM

Lalu Son Claims Ghosts in Government Bungalow - Sakshi

ప్రభుత్వ భవనం.. పక్కనే తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ (ఫైల్‌ ఫోటో)

పట్నా : ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన లాలూ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ విచిత్రమైన వాదనను వినిపిస్తున్నాడు. ఆ భవనంలో దెయ్యాలు ఉన్నాయనే ఖాళీ చేశామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీలు నన్ను భవనం ఖాళీ చేయించటానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అందుకే వాళ్లు అందులోకి దెయ్యాలను వదిలారు’ అంటూ తేజ్‌ పేర్కొన్నాడు. గతంలో నితీశ్‌ హయాంలో తేజ్‌ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఈ బంగ్లాను కేటాయించారు. దేశ్‌రత్న మార్గ్‌లో ఉన్న ఈ భవనానికి వాస్తు దోషం మూలంగా అప్పుడు తేజ్‌ మార్పులు కూడా చేయించాడు. అయితే మహాకూటమితో విడిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్‌కు నితీశ్‌ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించటం.. అది సెంటిమెంట్‌గా భావించి తేజ్‌ ఖాళీ చేయలేదు. 

ఇంతలో ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే ఇలా ఉన్నపళంగా దెయ్యాలున్నాయంటూ భవనాన్ని ఖాళీ చేసేశాడు. అయితే ఇదంతా అతను చేస్తున్న జిమిక్కుగా జేడీయూ అభివర్ణిస్తోంది. అతని సోదరుడు తేజస్వి యాదవ్‌ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు. అందుకే మీడియా దృష్టిని తనవైపు మళ్లించుకోవటానికే దెయ్యాలంటూ తేజ్‌ ప్రతాప్‌ నాటకాలు ఆడుతున్నాడు అంటూ జేడీయూ నేతలు మండిపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement