తెరపైకి కొత్త జిల్లాలు - | Sakshi
Sakshi News home page

తెరపైకి కొత్త జిల్లాలు

Published Sun, Apr 2 2023 7:16 AM | Last Updated on Sun, Apr 2 2023 7:16 AM

అసెంబ్లీ  - Sakshi

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయం తెరపైకి వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు 8 కొత్త జిల్లాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి అసెంబ్లీలో శనివారం రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చుతున్నాయి. అలాగే చైన్నెలో ట్రాఫిక్‌ రద్దీ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. షోళింగనల్లూరులో బ్రహ్మాండ గ్రీన్‌ పార్క్‌ ఏర్పాటు కానుంది.

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో 2019 వరకు 32 జిల్లాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో విల్లుపురాన్ని విడగొట్టి కళ్లకురిచ్చి, తిరునల్వేలిని విడగొట్టి తెన్‌కాశి, కాంచీపురాన్ని చీల్చి చెంగల్పట్టు, వేలూరును విడదీసి తిరుపత్తూరు, రాణిపేట, నాగపట్నం నుంచి మైలాడుతురై జిల్లాలు ఆవిర్భవించాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 38కి చేరింది. అదే సమయంలో తంజావూరును చీల్చి కుంభకోణం కేంద్రంగా ఓ జిల్లాతో పాటు మరికొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రజలు డమాండ్‌ చేశారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో ఆ నినాదం మరుగున పడింది.

మళ్లీ కొత్త జిల్లాల డిమాండ్‌
అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శనివారం పోలూరు ఎమ్మెల్యే సేవూరు రామచంద్రన్‌ తన ప్రసంగంలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని తెరమీదకు తెచ్చారు. తిరువణ్ణామలై అతి పెద్ద జిల్లాగా ఉందని, దీన్ని విడదీసి ఆరణి కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటించాలని కోరారు. దీనిపై రెవెన్యూ మంత్రి కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌ స్పందించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే పలు కొత్త జిల్లాల కోసం ప్రభుత్వానికి వినతులు పంపించారని వివరించారు. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో కొత్తగా మరో 8 జిల్లాల ఆవిర్భావం అవశ్యమని పేర్కొన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో రెవెన్యూ డివిజన్లు, తాలూకాలు, రెవెన్యూ గ్రామాలు, బ్లాకులు, మున్సిపాలిటీలు, పట్టణ, గ్రామ పంచాయతీల విభజన తప్పనిసరని తెలిపారు. ఈ వ్యవహారంపై సీఎంకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. దీనిపై చర్చించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అన్నీ సజావుగా జరిగితే కొత్త జిల్లాలపై దృష్టి పెడతామన్నారు.

మంత్రుల సమాధానాలు
ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. మంత్రి నెహ్రూ మాట్లాడుతూ కావేరి – కొల్లిడం ఉమ్మడి తాగునీటి పథకం త్వరలో అమల్లోకి తెస్తామని తెలిపారు. పెరంబలూరు వాసుల దాహార్తిని తీర్చేందుకు రూ. 90 కోట్లతో పథకం చేపట్టనున్నట్టు వివరించారు. రూ.90 కోట్లతో పలాలవరం భూగర్భ డ్రైనేజీ పనులను చేపట్టినట్టు తెలిపారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వార్డుల విభజన పనులపై దృష్టి పెట్టామని, రెండేళ్లలో ముగిస్తామన్నారు. కావేరి– వైగై– గుండారు అనుసంధానం జరిగి తీరుతుందని మంత్రి దురైమురుగన్‌ చెప్పారు. రూ. 36 కోట్లతో 7 ఆలయాలకు రాజగోపురాలను నిర్మించనున్నామని దేవదాయ శాఖమంత్రి శేఖర్‌ బాబు తెలిపారు.

పేపర్‌ ప్రసంగాలు వద్దు
సభ్యులకు స్పీకర్‌ అప్పావు సున్నితంగా క్లాస్‌ పీకారు. మాజీ మంత్రి అన్భళగన్‌ పేపర్‌లో రాసుకొచ్చిన విషయాలను చదువుతుండగా స్పీకర్‌ అప్పావు జోక్యం చేసుకున్నారు. పేపర్‌ లెస్‌గా సభ వ్యవహారాలు జరుగుతున్నా, అనేక మంది సభ్యులు పేపర్‌లో ప్రసంగాలు రాసుకొచ్చి చదివేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పద్ధతి మారాలని ఆయన హితవు పలికారు.

మూడు శాఖలపై చర్చ
అసెంబ్లీలో మూడు శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చ జరిగింది. మంత్రి ఏవీ వేలు రహదారులు, ప్రజా పనుల శాఖలకు నిధుల కేటాయింపులు. కొత్త పథకాలను వివరించారు. చైన్నెలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పథకం అమలు చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో వివరాలను వెల్లడిస్తామన్నారు. రామేశ్వరం నుంచి శ్రీలంకకు ప్రయాణికుల పడవ నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని పురాతన, పారంపర్య భవనాల సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీ శాఖ మంత్రి మనోతంగరాజ్‌ మాట్లాడుతూ షోళింగనల్లూరులో రూ.20 కోట్లతో గ్రీన్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవహారంలో ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
తమిళనాడు జిల్లాల మ్యాప్‌
1/1

తమిళనాడు జిల్లాల మ్యాప్‌

Advertisement
 
Advertisement
 
Advertisement