సాక్షి, చైన్నె : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో మాస్క్‌లు, భౌతిక దూరాలను తప్పనిసరి చేశారు. ఇక, తమిళనాడులో ముందు జాగ్రత్తలలో భాగంగా కరోనా చికిత్స శిబిరాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఈనెల 10, 11 తేదీలలో అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయా అని పరిశీలించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో చైన్నె, శివారు జిల్లాలు, కోయంబత్తూరులలో అధికంగా కేసులు ఉన్నాయి. తూత్తుకుడిలో ఓ మరణం కేసు సైతం ఈ ఏడాది నమోదైంది. దీంతో ముందు జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టారు. అదే సమయంలో శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవ్య అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా కట్టడి, ముందు జాగ్రత్తల విస్తృతంపై ఆయన ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు.
తప్పనిసరిగా ధరించాల్సిందే..
పుదుచ్చేరి విపత్తుల నిర్వహణాధికారి వల్లవన్ మీడియాతో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో కరోనా కేసుల కట్టడికి ప్రజల సహకారం కోరుతున్నామన్నారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సిందేనని ఆదేశించారు. ఆస్పత్రులు, బస్సులు, జన సంచార ప్రదేశాలు, సినిమా థియేటర్లు, వినోద కేంద్రాలు ఇలా అన్నిచోట్ల మాస్క్‌లను తప్పనిసరి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్క్ ధరించి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. భౌతిక దూరాలను పాటించే విధంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.
ముందు జాగ్రత్త...
తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయా అని పరిశీలించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నామని వివరించారు. చికిత్స విధానాలు, ఏర్పాట్ల అంశాలపై ఈనెల 10, 11 తేదీలలో మాక్‌డ్రిల్‌కు నిర్ణయించామన్నారు. ఇప్పటికే ముందు జాగ్రత్తగా అన్ని సిద్ధం చేశామని, ఓ మారు వాటి పనితీరు, చికిత్స విధానాలను తెలుసుకునే విధంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరాలను పాటించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment