స్విమ్మింగ్ పూల్‌లో పార్వతి
సాక్షి, చైన్నె : మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఏనుగు పార్వతి కోసం అతిపెద్ద స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. రూ. 23 లక్షలతో 3,500 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పార్వతి ఆనంద తాండవం చేస్తూ జలకాలాటలో మునిగింది. వివరాలు.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆలయం ప్రవేశ మార్గంలో పార్వతి అనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణతో కనిపిస్తుంటుంది. 2000 సంవత్సరంలో ఈ ఏనుగును ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. అమ్మవారి సేవలో నిమగ్నమైన ఈ ఏనుగు ఆరోగ్య సంరక్షణలో అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.
పార్వతిలో మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపేవిధంగా ఆలయం తూర్పు గోపురం ప్రవేశ మార్గం సమీపంలోని స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ. 23 లక్షల వ్యయంతో 3,500 చదరపు అడుగుల స్థలంలో ఐదు అడుగుల లోతులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. ఆదివారం జరిగిన పూజాది కార్యక్రమాలతో ఈ స్విమ్మింగ్ పూల్‌ను ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ప్రారంభించారు. ఆలయ ఏనుగుకు ప్రత్యేకపూజలు , ఆహారం అందజేశారు. అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి ఏనుగును పంపించారు. స్విమ్మింగ్ పూల్‌లో అటు ఇటు చక్కర్లు కొడుతూ ఆనంద తాండవంతో గజరాజు జలకాలాటలలో మునిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో నిర్మించిన షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment