
తిరువళ్లూరు: డబ్బుకు ఆశపడి మొదటి భార్య వుండగానే రహస్యంగా ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలు.. తను ఉండగా మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిడ్డతో మహిళ ఆందోళనకు దిగింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం సమీపంలోని వండిమేట్టు గ్రామానికి చెందిన మారియమ్మాల్ తండలం గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని ప్రేమించి 2007వ సంవత్సరంలో వివాహం చేసుకుంది.
వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. గత కొద్ది నెలల కిందట భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అదునుగా భావించిన రమేష్ మొదటి భార్యకు తెలియకుండా తండలం గ్రామానికి చెందిన ఓ మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మారియమ్మాల్ నేరుగా రమేష్ ఇంటికి వెళ్లి నిలదీయగా, దాడి చేసి గాయపరిచినట్టు తెలుస్తుంది. తనతో నీకు సంబంధం లేదని బయటకు విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించడంతో మనస్తాపం చెందిన మహిళ సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టింది.
తాను ఉండగానే రెండవ వివాహం చేసుకున్న భర్తపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేసింది. దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మహిళను స్టేషన్‌కు తరలించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది.
Comments
Please login to add a commentAdd a comment