ఐశ్వర్య (ఫైల్)
సాక్షి, చైన్నె : కొత్తగా నిర్మించిన విమానాశ్రయ పార్కింగ్ టెర్మినల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి సినిమా థియేటర్‌లో పీఎస్–2 చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన మహిళ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చైన్నె విమానాశ్రయం ఆవరణలో ఆరు అంతస్తులతో బ్రహ్మాండ మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక్కడ 2వేల కార్లు, ద్విచక్ర వాహనాల నిలిపేందుకు సౌకార్యలు కల్పించడమే కాదు, సినిమా థియేటర్లు సైతం నిర్మించి ఉన్నారు.
ఇక్కడ పీఎస్–2 చిత్రాన్ని వీక్షించేందుకు తన ఇద్దరు పిల్లలతో పల్లావరం సమీపంలోని పులిచ్చలూరుకు చెందిన బాలాజీ భార్య ఐశ్వర్య(35) వచ్చారు. శుక్రవారం రాత్రి సినిమా ప్రదర్శన మధ్యలో ఆమె ఇద్దరు పిల్లలను థియేటర్‌లో వదిలి బయటకు వచ్చారు. నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. పై నుంచి ఎవరో కింద పడడాన్ని గుర్తించిన పార్కింగ్ సిబ్బంది పరుగులు తీశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తల్లి మరణ సమాచారం తెలియక 9వ తరగతి, 5వ తరగతి చదివే ఆమె కుమారుడు, కుమార్తె ఇద్దరు సినిమా చూస్తూ ఉండి పోయారు. చివరకు తల్లి కనిపించక పోవడంతో ఆందోళనకు లోనయ్యారు. పోలీసులు ఆ పిల్లలను తమ సంరక్షణలో ఉంచుకున్నారు. విచారణలో బాలాజీ అమెరికాలో హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. ఇద్దరు పిల్లలతో ఐశ్వర్య మాత్రం పులిచ్చలూరులో ఉన్నట్లు గుర్తించారు. పిల్లలు తెలిపిన వివరాల మేరకు బంధువులకు సమాచారం అందించారు. గత కొన్ని నెలలుగా ఐశ్వర్య తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు వెలుగు చూసింది.
ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోంది. అయితే బ్రహ్మాండంగా రూపుదిద్దుకున్న విమానాశ్రయ టెర్మినల్‌లో తొలి ఆత్మహత్య ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment