
రాజతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ ఆర్‌ఎన్ రవి
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 7వ తేదీతో రెండేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ప్రజా పాలన మూడో వసంతంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు చేపట్టాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దీంతో పలువురు మంత్రుల పదవులు ఊడినట్లే అనే చర్చ జోరందుకుంది. అయితే పాడి పరిశ్రమల శాఖ మంత్రి నాజర్‌కు మాత్రమే ఉద్వాసన పలికారు. డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వారసుడు టీఆర్‌బీ రాజకు కొత్తగా మంత్రి వర్గంలో చోటు కల్పించారు.
వేడుకగా ప్రమాణ స్వీకారం..
గురువారం ఉదయం గిండిలోని రాజ్‌భవన్‌లో మంత్రిగా టీఆర్‌బీ రాజతో గవర్నర్ ఆర్‌ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ రవికి సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛాలను అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్‌బీ రాజ సీఎం స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీఆర్‌బీ రాజకు మంత్రి పదవి దక్కడంతో మన్నార్‌కుడిలోని ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. తిరువారూర్ జిల్లాకు ఇంతవరకు మంత్రి లేరు.
ఆ లోటు టీఆర్‌బీ రాజ రూపంలో సీఎం స్టాలిన్ భర్తీ చేయడాన్ని ఆహ్వానిస్తూ అక్కడి డీఎంకే శ్రేణులు స్వీట్లు పంచి.. బాణసంచా పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కాగా, తన కుమారుడు రాజకు మంత్రి పదవి దక్కడంతో డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా రాజ ఉత్తమ సేవలు అందిస్తారన్నారు. సీఎం స్టాలిన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మరింత నమ్మకాన్ని పెంపొందించుకునే విధంగా పని తీరు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రులు అందరూ సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్‌ఎన్‌రవితో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తదుపరి జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి వర్గం మార్పుకు గురించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.
పీటీఆర్ చేజారిన ఆర్థికశాఖ
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, టీఆర్‌బీ రాజకు శాఖను కేటాయిస్తూ సీఎం స్టాలిన్ చేసిన సిఫారసులకు గవర్నర్ రవి ఆమోద ముద్ర వేశారు. సీఎం స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్(పీటీఆర్) వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు చేసినట్లుగా ఓ ఆడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు పదవీ గండం తప్పదనే చర్చ జరిగింది. అయితే ఆయనకు ఉద్వాసన పలకలేదు. ఆయన శాఖలో మాత్రం మార్పు చేశారు. ఆర్థిక శాఖ నుంచి ఆయన్ని తప్పించి ఐటీ శాఖకు మార్చారు. ఈ శాఖను తనకు కేటాయించడాన్ని ఆహ్వానిస్తూ, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ పీటీఆర్ ట్వీట్ చేశారు.
పలువురి మంత్రుల శాఖల్లో మార్పు
కొత్త మంత్రి టీఆర్‌బీ రాజకు పరిశ్రమల శాఖను కేటాయించారు. ఇది వరకు ఈ శాఖ తంగం తెన్నరసు చేతిలో ఉండేది. 2024 జనవరిలో పెట్టుబడిదారుల మహానాడు చైన్నె వేదికగా జరగనుంది. ఇందుకోసం ప్రపంచ దేశాలలో పర్యటించి పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు. ఆయనతో పాటు టీఆర్‌బీ రాజ కూడా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చి రాగానే రాష్ట్రంలో ప్రస్తుతం కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖ టీఆర్‌బీ ఖాతాలో పడడం గమనార్హం. ఇక ఆర్థిక శాఖను తంగం తెన్నరసుకు అప్పగించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆర్థిక శాఖకు తంగం తెన్నరసు పూర్తి స్థాయిలో అర్హుడు అని పలువురు సీనియర్ మంత్రులు సైతం కితాబు ఇవ్వడం విశేషం. సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్‌కు అదనంగా తమిళాభివృద్ధి శాఖను కేటాయించారు. ఇది వరకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న టి. మనో తంగరాజ్‌కు ప్రస్తుతం పాడి పరిశ్రమల శాఖను అప్పగించారు. శాఖల కేటాయింపు తర్వాత మంత్రులు టీఆర్‌బీ రాజ, పీటీఆర్, తంగం తెన్నరసు, ఎంపీ స్వామినాథన్, మనో తంగరాజ్ సీఎం స్టాలిన్‌ను సచివాలయంలో కలిసి.. ఆశీస్సులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment