గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగు అరి కొంబన్
సాక్షి, చైన్నె: తమిళ అటవీ అధికారులను అరి కొంబన్ ఏనుగు ముప్పుతిప్పలు పెడుతోంది. దీనిని పట్టుకునేందుకు అధికారులు ఉరకులు.. పరుగులు తీస్తున్నారు. అయితే దీనికి మత్తు మందు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇటీవల ఈ ఏనుగును పట్టుకునే సమయంలో కేరళ అధికారులు అనేక డోస్‌లుగా మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో మరోసారి ఇచ్చేందుకు సంశయిస్తున్నారు. వివరాలు.. కేరళను వణికించిన అరి కొంబన్‌ఏనుగు ఆదివారం తమిళనాడు సరిహద్దులోని తేని జిల్లా కంబం పట్టణంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
ఈ ఏనుగు వీరంగం సృష్టిస్తుండడంతో దీనిని అడవిలోకి తరిమేందుకు వందలాదిగా అటవీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. కంబం పట్టణం ఈ ఏనుగు పుణ్యమా నిర్మానుష్యంగా మారింది. ఉదయాన్నే ఈ ఏనుగు కంబం నుంచి వీడి పొరుగున ఉన్న సురులి పట్టి గ్రామంలోకి ప్రవేశించింది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఈ ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి నిర్ణయించినా, చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది వరకు ఈ ఏనుగును కేరళ అధికారులు పట్టుకునే క్రమంలో పలు డోస్‌లుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు తేలింది. ప్రస్తుతం మళ్లీ ఇంజెక్షన్ ఇచ్చిన పక్షంలో ఏనుగు ఆరోగ్యానికి ఏదేని ముప్పు తప్పదేమో అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
మంత్రి సమీక్ష..
ఈ ఏనుగును అడవిలోకి తరిమి కొట్టడం లేదా, ఎలాగైనా పట్టుకునే విధంగా కుంకీలను రంగంలోకి దించారు. కోయంబత్తూరు జిల్లా ముదుమలై శరణాలయం నుంచి స్వయంబు అనే ఏనుగుతో పాటుగా మరో రెండు కుంకీలను రంగంలోకి దించారు. ఈ మూడు కుంకీలు సురులి పట్టి పరిసరాలల్లో తిష్ట వేశారు. అరి కొంబన్‌ను మచ్చి చేసుకునే విధంగా కుంకీలు ప్రయత్నాల్లో ఉన్నాయి. అరి కొంబన్ రూపంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడంతో పాటుగా దానిని పట్టుకునేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక ఆపరేషన్‌పై అటవీ శాఖ మంత్రి మది వేందన్ దృష్టి పెట్టారు. ఆదివారం మధ్యాహ్నం అటవీ, పోలీసు అధికారులు, కలెక్టర్లు, వైద్యులతో ఆయన సమావేశమయ్యారు. అరి కొంబన్‌ను ఎలాగైనా పట్టుకుని తీరాలని నిర్ణయించారు. అలాగే, ఈ ఏనుగు కారణంగా ప్రాణ హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలను గ్రామంలో విస్తృతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment