సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి ఈసారి ఎలాగైనా తమ ప్రతినిధులు పార్లమెంట్‌లో అడుగు పెట్టాలన్న లక్ష్యంగా బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులోభాగంగా తమిళనాడులో కీలక స్థానాలపై గురి పెట్టి కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నది. మదురై నుంచి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు నుంచి ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ను పోటీలో నిలబెట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తమ బలాన్ని చాటుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తోంది.
అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉన్నట్టు ౖపైపెకి చెప్పకుంటున్నా, లోలోపల ఆ పార్టీకి ఎసరు పెట్టే పరిస్థితులకు సంబంధించిన వ్యూహాలకు బీజేపీ పెద్దలు పదును పెట్టారు. ఈసారి ఎలాగైనా తమిళనాడు నుంచి ప్రతినిధి పార్లమెంట్‌లో అడుగు పెట్టడమే కాకుండా, అధిక స్థానాలను కై వసం చేసుకుని తీరాలన్న లక్ష్యంతో కార్యక్రమాలను విస్తృతం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలను అవినీతి పార్టీలుగా చిత్రీకరించి తాము లాభపడే విధంగా వ్యూహాలకు పదును పెట్టారు. అదే సమయంలో తమిళనాడు నుంచే ప్రధాని అంటూ రెండు రోజుల క్రితం చైన్నె, వేలూరు పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొత్త ప్రకటనను తెరపైకి తెచ్చి వెళ్లారు.
దీంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు నుంచి పోటీ చేస్తారా అనే చర్చ ఊపందుకుంది. అదే సమయంలో తమిళనాడులో ఏకంగా 15కు పైగా స్థానాలను గురి పెట్టి బీజేపీ కార్యక్రమాలను విస్తృతం చేసి ఉండడం గమనార్హం. ఈ పరిస్థితులలో తమిళనాడులో పోటీ చేసే అభ్యర్థుల జాబితా కసరత్తుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈమేరకు కొందరు ముఖ్య అభ్యర్థుల పేర్లను ముందుగానే వెల్లడించి, ఆయా నియోజకవర్గాలపై వారు పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు తగిన కార్యాచరణలో ఉన్నట్టుంది.
ఇందులో భాగంగా తాజాగా రెండు కీలక నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు సూచనప్రాయంగా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు మదురై లోక్‌సభ నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు లోక్‌సభ నుంచి ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పోటీలోకి దిగడం ఖాయం అన్నట్టుగా ఢిల్లీ నుంచి సమాచారాలు వెలువడుతున్నాయి. ఇది వరకటి వరకు రాజ్యసభ పదవితో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వ్యవహరిస్తూ వచ్చారు. ఈ సారి ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో తనకు నచ్చిన మదురై నుంచి పోటీ చేయడానికి ఉత్సాహంగానే ఉన్నట్టు బీజేపీలో ప్రచారం ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment