ఎస్‌జీ సూర్య
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్యను మదురై పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ ఎంపీ వెంకటేషన్‌కు వ్యతిరేకంగా ఆయన వివాదాస్పద, ఆధార రహిత ఆరోపణల కేసులో పోలీసులు కన్నెర్ర చేశారు. శనివారం ఉదయం మదురై కోర్టు న్యాయమూర్తి రామశంకర్ ఎదుట హాజరు పరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం సూర్య ట్వీట్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
మదురై సీపీఐ ఎంపీ వెంకటేశన్‌కు వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. మదురై కమ్యూనిస్టు కౌన్సిలర్ రూపంలో పారిశుధ్య కార్మికుడు బలి అయ్యాడని పేర్కొంటూ, ఈ వ్యవహారంలో ఎంపీ మౌనంగా ఉండాల్సిన అవసరం ఏమిటో అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఏమయ్యాయో అని ప్రశ్నిస్తూ, అదే బీజేపీని విమర్శించాలంటే చటుక్కున స్పందించే ఎంపీ, ఇప్పుడెక్కడ అని తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారాన్ని మదురైలోని కమ్యూనిస్టు నేతలు తీవ్రంగా పరిగణించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాత్రికి రాత్రే మదురైకు తరలింపు...
మదురై నుంచి చైన్నె వచ్చిన ప్రత్యేక బృందం శుక్రవారం రాత్రి సూర్యను అరెస్టు చేయడానికి సిద్ధమైంది. టీనగర్‌లోని నివాసంలో సూర్య ఉన్న సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. తొలుత కమిషనర్ కార్యాలయానికి తరలించి విచారించారు. ఈ అరెస్టు సమాచారంతో బీజేపీ వర్గాలు కమిషనరేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. సూర్యను విడుదల చేయాలని కోరుతూ అర్ధరాత్రి వేళ పూందమల్లి హైరోడ్డులో రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో గట్టి భద్రత నడుమ రాత్రికి రాత్రే మదురైకు తరలించారు.
ఉదయాన్నే మదురై కోర్టు న్యాయమూర్తి రామశంకర్ ఇంటికి తీసుకెళ్లారు. ఆయన రిమాండ్‌కు ఆదేశించడంతో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. సూర్యపై శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా పోస్టులు పెట్టడం, ఇరు వర్గాల మధ్య వివాదం, రెచ్చగొట్టడం, వదంతులు సృష్టించడం వంటి ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా మంత్రి సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా కేంద్ర సంస్థ ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్న తరుణంలో తమిళనాడుకు చెందిన బీజేపీ అధ్యక్షుడిపై పోలీసులు కన్నెర్ర చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment