మీడియాతో మాట్లాడుతున్న కుష్బు
సాక్షి, చైన్నె: బీజేపీ మహిళా నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బులో ఆక్రోశం రగిలింది. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో డీఎంకే నాయకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఎంతటి వారైనా సరే వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. డీఎంకే అధికార ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి ఓ సభలో కుష్బుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీనిపై కుష్బు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అనాగరికంగా మహిళలను ఉద్దేశించి ఎవరైనా మాట్లాడితే, అది వారి తల్లిని కించపరిచినట్టే అని మండిపడ్డారు.
మహిళలకు వ్యతిరేకంగా ఒక నాయకుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుంటే, సీఎం మౌనం వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తన ఇంటి మీద రాళ్లు విసిరినా భయపడను అని హెచ్చరించారు. ఇప్పటికే తన ఇంటి మీద గతంలో దాడి చేశారని గుర్తు చేస్తూ, ఇక ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ఎదురు దాడికి తాను సిద్ధం అని హెచ్చరికలు చేశారు. తాను పార్టీ రీత్యా చూడడం లేదని, మహిళలను కించ పరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా అది చట్టపరంగా నేరం అని స్పష్టం చేశారు.
మహిళలను కించపరిచే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తన కోసం మాట్లాడడం లేదని, కించపరిచే వారిపై ఎదురు దాడికి ప్రతి మహిళ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో తాను ముందు ఉంటానని స్పష్టం చేశారు. గొడవకై నా సరే, ఎదురు దాడికై నా సరే తనకు ధైర్యం ఉందన్నారు. తాను ప్రతిభను నమ్ముకుని తమిళనాడుకు వచ్చానని, తనను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు.
మహిళలను కించ పరిచే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే తాను చూస్తూ ఊరుకోబోనని వ్యాఖ్యలు చేశారు. వేదికలు ఎక్కి మహిళలను కించ పరిచే అధికారం డీఎంకే వాళ్లకు ఎవరు ఇచ్చారో అని ప్రశ్నిస్తూ, చట్ట రీత్య వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తనలోని ఆక్రోశాన్ని వెళ్లగక్కే విధంగా మరిన్ని వ్యాఖ్యలతో కుష్బు సమావేశంలో ఆవేశంతో స్పందించడం గమనార్హం.
శివాజీ కృష్ణమూర్తికి ఉద్వాసన
కుష్బుకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తిని డీఎంకే నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదివారం రాత్రి విడుదల చేశారు. పార్టీకి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించిన శివాజీ కృష్ణ్ణమూర్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, కుష్బు తీవ్ర ఉద్వేగం, ఆక్రోశంతో స్పందించిన కొన్ని గంటల్లో దురైమురుగన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ చర్యలను కుష్బు ఆహ్వానించారు. అయితే, శివాజీ కృష్ణమూర్తిపై తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment