నితీష్‌కుమార్‌తో సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా జాతీయస్థాయి రాజకీయాలపై డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. బిహార్‌లోని పాట్నా లో జాతీయ రాజకీయచట్రంలో తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే గురువారం రాత్రి, శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పాట్నాలో బిజీబిజీ అయ్యారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యనేతలతో పలకరింపులతో బీజేపీకి వ్యతిరేకంగా తన తీవ్రగళాన్ని స్టాలిన్ వినిపించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
మొదటి నుంచి డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ ద్వారా తన ప్రభుత్వాన్ని కేంద్రం ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేయడాన్ని, తమను బెదిరించి దారిలోకి తెచ్చుకునే విధంగా కేంద్రం సాగిస్తున్న పరిణామాలను స్టాలిన్ తీవ్రంగానే పరిగణించారు. కేంద్రం చర్యలను వ్యతిరేకించడమే కాకుండా, సమయం దొరికినప్పుడల్లా తీవ్ర స్వరంతో హెచ్చరికలు సైతం చేస్తున్నారు. ఈ పరిస్థితులో బిహార్ సీఎం నితీష్‌కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే విధంగా పాట్నా వేదికగా శుక్రవారం జరిగిన సమావేశం ద్వారా దివంగత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గతంలో అనుసరించిన ఫార్ములాతో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చాటే ప్రయత్నం చేశారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలను తాము కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేయడం విశేషం
ఒక రోజు ముందుగానే..
ఈ సమావేశం నిమిత్తం గురువారమే పాట్నాకు సీఎం స్టాలిన్ వెళ్లారు. అదే రోజు రాత్రి ఆయన సీఎం నితీష్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని గంటల పాటు రాజకీయ అంశాలపై ఈ భేటీ జరిగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్‌తో కూడా భేటీ అయ్యారు. ఈసందర్భంగా దివంగత నేత కరుణానిధితో తనకు ఉన్న అనుబంధం గురించి లాలు వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌తో పాటు పలువురు ముఖ్యప్రముఖులను శుక్రవారం స్టాలిన్ కలిశారు. బిహార్‌లోని పలువురు తమిళ అధికారులు స్టాలిన్‌ను కలవడం విశేషం. అనంతరం జరిగిన లౌకిక వాద పార్టీల నేతల సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా స్టాలిన్ తన ఆగ్రహాన్ని తీవ్రంగానే వ్యక్తం చేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అందరూ ఐక్యతతో ముందుకు వెళ్తే, బీజేపీని ఓడించడం ఖాయం అన్న ధీమాను స్టాలిన్ వ్యక్తం చేయడం విశేషం. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలతో స్టాలిన్ ప్రత్యేకంగా కలవడమే కాకుండా జాతీయ రాజకీయాలలో డీఎంకే మరింత చురుగ్గా పాల్గొనబోతోందన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం.
నమ్మకం ఉంది..
పాట్నా పర్యటన ముగించుకుని రాత్రి చైన్నెకు చేరుకున్న సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం ఓ నమ్మకాన్ని కలిగించిందన్నారు. బీజేపీని ఓడించి తీరాలన్న సంకల్పంతో అన్ని పార్టీలు ఉన్నట్టు వివరించారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించాలంటే ఐక్యతతో, ఒకే గళంతో అందరూ ముందుకెళ్లాల్సిన తరుణం ఇదేనని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి కన్నా, ముందుగానే కూటమిని తేల్చడం మంచిదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2024లో బీజేపీని ఓడించి తీరుతామన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరం ఏకం కావడం నమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment