మంత్రి సెంథిల్ బాలాజీ కేసులో మద్రాసు హైకోర్టులో బుధవారం ‘ధర్మ’సంకటం ఏర్పడింది. ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు మంగళవారం భిన్న తీర్పులను వెలువరించారు. ఒకరు సెంథిల్ అరెస్టు చట్ట విరుద్ధం కాదని, మరొకరు చట్ట విరుద్ధమేనంటూ వేర్వేరు తీర్పులు ఇవ్వడంతో మూడో న్యాయమూర్తి ప్రమేయం తప్పనిసరిగా మారింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది.
సాక్షి, చైన్నె: మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీని గత నెల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఉత్కంఠ, నాటకీయ పరిణామాల మధ్య ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. విచారణ సమయంలో గుండె పోటు రావడంతో సెంథిల్ బాలాజీని తొలుత ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో కావేరి ఆసుపత్రికి తరలించి బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయనకు విధించిన రిమాండ్ కాలాన్ని ఈనెల 12వ తేదీ వరకు పొడించారు. అదే సమయంలో సెంథిల్‌ను ఎలాగైనా తమ కస్టడీకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈడీ వర్గాలు తీవ్రంగానే న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నాయి.
ఇక, తన భర్తను ఈడీ చట్ట విరుద్ధంగా అరెస్టు చేసినట్టు సెంథిల్ సతీమణి మేఘల కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే గత నెల 13వ తేదీ రాత్రే విచారణ ముగించినట్టు ఈడీ పేర్కొందని, అయితే మరుసటి రోజు ఉదయం రెండు గంటల అనంతరం అరెస్టు చూపించారని కోర్టుకు వివరించారు. ఈ రెండుగంటల పాటు తన భర్తను ఎక్కడ ఉంచారో..? ఏం చేశారో..? అన్ని వివరాలను కోర్టుకు ఈడీ తెలియజేయాలని, తన భర్త అరెస్టును రద్దు చేయాలని కోర్టులో వాదనలు తమ న్యాయవాదుల ద్వారా వినిపించారు. ఈడీ సైతం బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచింది.
సెంథిల్‌ను చట్ట బద్ధంగానే అరెస్టు చేశామని వివరించారు. మెమో తీసుకోక పోవడంతో ఎస్‌ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అరెస్టు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశామని వాదించారు. ఆయన్ని ఇంత వరకు తాము విచారించ లేదని పేర్కొంటూనే, ఆయనకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు తమ వద్ద ఉందని కోర్టుకు వివరించారు. వీటిని తారు మారు చేసే పరిస్థితులు ఉన్నట్లు వాదించారు. వారం రోజులు ఈ వాదనలు జరగ్గా, తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు నిషా భాను, భరత చక్రవర్తి వాయిదా వేశారు.
ఆసక్తికరంగా..
వాదనలను పరిశీలించిన అనంతరం మంగళవారం న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. నిషా భాను తన తీర్పులో ఈ పిటిషన్ విచారణ యోగ్యమేనని పేర్కొన్నారు. సెంథిల్ బాలాజీ అరెస్టును చట్ట విరుద్ధంగా భావిస్తున్నామని ప్రకటించారు. సెంథిల్ ఆస్పత్రిలో ఉన్న కాలాన్ని కస్టోడియల్ గడువు నుంచి మినహాయించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసి పుచ్చారు. అదే సమయంలో ఈ తీర్పునకు భిన్నంగా న్యాయమూర్తి భరత చక్రవర్తి తీర్పు వెలువరించారు. మేఘల పిటిషన్ విచారణ యోగ్యం కాదని స్పష్టం చేశారు. అరెస్టు అనంతరం సెంథిల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, ఈ వ్యవహారాలన్ని చట్టబద్ధంగానే జరిగినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే కస్టోడియల్ గడువును పెంచుతున్నట్టు ప్రకటించారు.
కావేరి ఆస్పత్రిలో వైద్యుల సూచన మేరకు ఆయన చికిత్సలో ఉన్నారని , ఆతదుపరి పరిణామాలతో జైలుకు పంపించడం లేదా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవచ్చు అని సూచించారు. ఒకరు చట్ట విరుద్ధమని, మరొకరు చట్టబద్ధంగానే అరెస్టు జరిగినట్టు భిన్న తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. భిన్న తీర్పుల నేపథ్యంలో ఈకేసులోకి మూడో న్యాయమూర్తి ప్రమేయం అవశ్యమైంది. దీనిపై హైకోర్టు సీజే ఎస్వీ గంగాపూర్వాలకు ద్విసభ్య బెంచ్ సిఫార్సు చేసింది. న్యాయమూర్తుల మధ్య భిన్న తీర్పుపై సీనియర్ న్యాయవాది ఎన్‌ఆర్ ఇలంగో స్పందిస్తూ, కొన్ని కేసుల్లో భిన్న తీర్పులు సహజమేనని, ఇది వరకు భిన్న తీర్పులు వెలువరించిన కేసులను గుర్తు చేశారు. మూడో న్యాయమూర్తి ఎదుట బలమైన వాదనలు ఉంచుతామన్నారు.
వారంలో మూడో న్యాయమూర్తి నియామకం
సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల దాఖలు చేసిన పిటిషన్‌పై ఓ వైపు హైకోర్టులో భిన్న తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు సైతం చేరింది. సెంథిల్ బాలాజీని కావేరి ఆసుపత్రికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ కూడా మంగళవారమే విచారణకు వచ్చింది. కేసులో ఆధారాలను తారు మారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విచారణలో జాప్యం జరిగే కొద్ది కేసు వీగి పోయే పరిస్థితులు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంలో హైకోర్టు సైతం భిన్న తీర్పును వెలువరించిన విషయాన్ని ప్రస్తావించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో మూడో న్యాయమూర్తి నియామకం జరగాలని, తొలి ప్రాధాన్యతగా పరిగణించి కేసును త్వరితగతిన విచారించి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా, సెంథిల్ వ్యవహారంలో మూడో న్యాయమూర్తి ప్రమేయంతో మళ్లీ కేసు మొదటికి వచ్చినట్లయ్యిందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment