శివరాజ్
సాక్షి, చైన్నె: పుట్టింది పేదరికంలో అయినా పట్టు వదలకుండా చదివాడు. డాక్టర్ కావాలన్న ప్రయత్నం బెడిసి కొట్టినా, సమయాన్ని వృథా చేయకుండా కానిస్టేబుల్ అయ్యాడు. పట్టువదలకుండా ప్రయత్నం చేసి ఈ ఏడాది కృష్ణగిరి ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును దక్కించుకున్నాడు. ఇది ఆవడి స్పెషల్ పోలీసు బెటాలియన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ లక్ష్యం. ధర్మపురి జిల్లా పెన్నగరం పుదుకంబట్టికి చెందిన మాణిక్యం, ఇన్బవళ్లి దంపతులకు నలుగురు కుమారులు. రైతు కూలీలైన ఈ దంపతులకు చదువు లేదు.
ఈ దంపతుల మూడో కుమారుడు శివరాజ్(23)తో పాటు చివరి కుమారుడు చదువుల్లో రాణించారు. మూడో కుమారుడు శివరాజ్ 2016లో ప్లస్‌టూ ముగించాడు. ఇందులో 915 మార్కులు సాధించాడు. కటాఫ్ మార్కుల పుణ్యమా ఎంబీబీఎస్ సీటు దూరమైంది. దీంతో బీఎస్సీ చదవినానంతరం 2020లో సెకండ్ గ్రేడ్ కానిస్టేబుల్ ఎంపిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. గత ఏడాది నీట్ రాశాడు. అయితే, 263 మార్కులు మాత్రమే వచ్చాయి. మలి ప్రయత్నంగా ఈ ఏడాది పరీక్ష రాసిన శివరాజ్ 400 మార్కులు దక్కించుకున్నాడు. ఈ మార్కులతో పాటు తాను చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందుకు గాను 7.5 శాతం ప్రత్యేక రిజర్వుడ్ కోటా పరిధిలోకి వచ్చాడు.
ఈ కోటా సీట్ల భర్తీ శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా జరిగింది. ఇందులో కానిస్టేబుల్ శివరాజ్‌కు డాక్టరు అయ్యే అవకాశం దక్కింది. ఈ కోటా ఆధారంగా కృష్ణగిరి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వరించింది. పేద కుటుంబంలో పుట్టిన తాను, తన తమ్ముడు డాక్టరు అయ్యే అవకాశం దక్కిందని శివరాజ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన తమ్ముడు ప్రభుత్వ కళాశాలలో మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడని, ఇప్పుడు తాను మొదటి సంవత్సరంలో చేరబోతున్నట్లు పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment