రజనీకాంత్‌తో జపాన్ అభిమాని
తమిళసినిమా: రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్ నిర్మించిన చిత్రంలో రమ్యకృష్ణ, తమన్న, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, తెలుగు నటుడు సునీల్ ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. దీంతో రజినీకాంత్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. థియేటర్ల ముందు కటౌట్లకు పాలాభిషేకాలు, పటాసులు కాల్చడాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా నటుడు రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో ఈ సంఖ్య అధికంగా ఉంది. 1998లో విడుదలైన ముత్తు చిత్రం అప్పట్లోనే జపాన్‌లో రూ.23. 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కాగా అప్పటినుంచి రజనీకాంత్ నటించిన ప్రతి చిత్రాన్ని చూడటానికి జపాన్ అభిమానులు చైన్నెకి రావడం పరిపాటిగా మారింది. అదేవిధంగా జపాన్‌కు చెందిన ఓ రజనీకాంత్ వీరాభిమాని తన భార్యతో కలిసి జైలర్ చిత్రాన్ని చైన్నెలో చూడటానికి వారం రోజులు ముందే ఇక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ వాళ్లను తన ఇంటికి ఆహ్వానించి ముచ్చటించారు. ఆ జంట రజనీకాంత్ కోసం ఒక ప్రత్యేక బహుమతిని తీసుకురావడం విశేషం. కాగా గురువారం చైన్నెలోని ఓ థియేటర్లో ప్రేక్షకుల మధ్య జైలర్ చిత్రాన్ని చూసిన ఆ అభిమాని మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా అతను కొన్ని తమిళ డైలాగులు చెప్పి అందరిని ఖుషీ పరిచారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment