కమలంతో కటీఫ్!
సాక్షి, చైన్నె : కమలంతో కటీఫ్...ఇదే పార్టీ నిర్ణయం అని అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి అన్నాడీఎంకే మాజీ మంత్రులు మాటల దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరు పార్టీల మధ్య మంగళవారం పోస్టర్ల యుద్ధం జోరందుకుంది.
వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తదుపరి పరిణామాలతో కమలానికి వ్యతిరేకంగా పళణి సేన రూ టు మార్చడం ఎన్‌డీఏ కూటమిలో కొత్త చర్చకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమను టార్గెట్ చేసి గతంలో తీవ్ర విమర్శలు చేసినా, దివంగత అమ్మ జయలలితకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించినా స్పందించని అన్నాడీఎంకే వర్గాలు, తాజా ఆయనపై ముప్పెట దాడికి దిగడం గమనార్హం.
నా మాటే పార్టీ శాసనం..
దివంగత ముఖ్యంత్రి అన్నాదురైకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన కొన్ని వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని అన్నాడీఎంకే మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకు వేసిన అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మాట్లాడుతూ, ఇక కమలంలో కటీఫ్ అని ప్రకటించారు. తన వ్యాఖ్యలే పార్టీ నిర్ణయం అని స్పష్టం చేయడం చర్చకు దారి తీసింది. ఇక అన్నామలైపై మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. చరిత్ర లేని వాళ్లకు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తమ నేతకు ఎన్‌డీఏ కూటమి ప్రాధాన్యతను ఇస్తుంటే, ఎలాంటి అర్హత, అనుభవం లేని అన్నామలై విమర్శలు ఎక్కుబెట్టడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు.
నేడు చస్తే..రేపు పాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరో మాజీ మంత్రి ఎస్పీ వేలు మణి మాట్లాడుతూ, చరిత్రనే మార్చేయడమే ఒక పార్టీ అధ్యక్షుడికి తగదు అని చురకలు అంటించారు. అన్నా గురించి మాట్లాడే అర్హత అన్నామలైకు లేదని మండి పడ్డారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే కూటమిలోకి ఉండే వారు డాలర్ నోటుతో సమానం అని వ్యాఖ్యలు చేశారు. అదే కూటమి నుంచి బయటకు వెళ్లే వారి పరిస్థితి చెల్లని నోటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నామలైకు హితవు పలికారు. తమ కూటమిలో ఉంటూ, తమనే విమర్శిస్తే,సహంచబోమని హెచ్చరించారు.
బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పోస్టర్ల యుద్ధం
ఓవైపు మాజీ మంత్రులు ఈ మాటల తూటాలను పేల్చుతున్న నేపథ్యంలో తూత్తుకుడిలో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో వెలిసిన పోస్టర్లు మరో చర్చకు దారి తీశాయి. ఇదే మంచి నిర్ణయం. ఇక కాషాయానికి ఫుల్‌స్టాప్ పెట్టేద్దామనే నినాదాలతో ఆ పోస్టర్లు ఉండడం గమనార్హం. అదే సమయంలో మదురైలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి దారి తీశాయి. ఇక, చర్చల్లేవు...దాడులే అన్న నినాదాలతో అన్నాడీఎంకేకు ఆ పోస్టర్ల ద్వారా హెచ్చరికలు చేశారు. అలాగే, ఈరోడ్‌తో పాటు మరికొన్ని చోట్ల అన్నాడీఎంకే నుంచి తాము కూడా బయటకు వచ్చేశామంటూ కమలనాథులు స్వీట్లు పంచుకోవడం గమనార్హం.
అన్నామలై, జయకుమార్ కారణం ఇదేనా..?
ఢిల్లీలో జరిగిన భేటీలో పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 20 సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు తెలిసింది. 14 సీట్లు తమకు, మిగిలిన సీట్లు మిత్రులకు తామే పంచే యోచనలో బీజేపీ ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పుదియ తమిళగం, ఐజేకే, పుదియ నీధి కట్చి, తమిళ మానిల కాంగ్రెస్ ఉన్నాయి. అలాగే తమ శతృవులుగా ఉన్న పన్నీరు సెల్వం శిబిరానికి రెండు , దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు శివగంగై సీటును కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక తాము దూరం పెట్టిన వ్యక్తులను బీజేపీ అక్కున చేర్చుకోబోతుండడాన్ని గ్రహించే, తాజాగా అన్నామలైను టార్గెట్ చేసి కాషాయంతో కటీఫ్ అన్న నినాదాన్ని పళణి శిబిరం అందుకుందనే చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment