Jayakumar
-
చరిత్ర లేని వాళ్లకు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదు
సాక్షి, చైన్నె : కమలంతో కటీఫ్...ఇదే పార్టీ నిర్ణయం అని అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి అన్నాడీఎంకే మాజీ మంత్రులు మాటల దాడికి దిగారు. ఇదే సమయంలో ఇరు పార్టీల మధ్య మంగళవారం పోస్టర్ల యుద్ధం జోరందుకుంది. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ తదుపరి పరిణామాలతో కమలానికి వ్యతిరేకంగా పళణి సేన రూ టు మార్చడం ఎన్డీఏ కూటమిలో కొత్త చర్చకు దారి తీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తమను టార్గెట్ చేసి గతంలో తీవ్ర విమర్శలు చేసినా, దివంగత అమ్మ జయలలితకు వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించినా స్పందించని అన్నాడీఎంకే వర్గాలు, తాజా ఆయనపై ముప్పెట దాడికి దిగడం గమనార్హం. నా మాటే పార్టీ శాసనం.. దివంగత ముఖ్యంత్రి అన్నాదురైకు వ్యతిరేకంగా అన్నామలై చేసిన కొన్ని వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని అన్నాడీఎంకే మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఓ అడుగు ముందుకు వేసిన అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మాట్లాడుతూ, ఇక కమలంలో కటీఫ్ అని ప్రకటించారు. తన వ్యాఖ్యలే పార్టీ నిర్ణయం అని స్పష్టం చేయడం చర్చకు దారి తీసింది. ఇక అన్నామలైపై మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. చరిత్ర లేని వాళ్లకు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తమ నేతకు ఎన్డీఏ కూటమి ప్రాధాన్యతను ఇస్తుంటే, ఎలాంటి అర్హత, అనుభవం లేని అన్నామలై విమర్శలు ఎక్కుబెట్టడం మంచి పద్ధతేనా..? అని ప్రశ్నించారు. నేడు చస్తే..రేపు పాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మరో మాజీ మంత్రి ఎస్పీ వేలు మణి మాట్లాడుతూ, చరిత్రనే మార్చేయడమే ఒక పార్టీ అధ్యక్షుడికి తగదు అని చురకలు అంటించారు. అన్నా గురించి మాట్లాడే అర్హత అన్నామలైకు లేదని మండి పడ్డారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే కూటమిలోకి ఉండే వారు డాలర్ నోటుతో సమానం అని వ్యాఖ్యలు చేశారు. అదే కూటమి నుంచి బయటకు వెళ్లే వారి పరిస్థితి చెల్లని నోటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నామలైకు హితవు పలికారు. తమ కూటమిలో ఉంటూ, తమనే విమర్శిస్తే,సహంచబోమని హెచ్చరించారు. బీజేపీ, అన్నాడీఎంకే మధ్య పోస్టర్ల యుద్ధం ఓవైపు మాజీ మంత్రులు ఈ మాటల తూటాలను పేల్చుతున్న నేపథ్యంలో తూత్తుకుడిలో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో వెలిసిన పోస్టర్లు మరో చర్చకు దారి తీశాయి. ఇదే మంచి నిర్ణయం. ఇక కాషాయానికి ఫుల్స్టాప్ పెట్టేద్దామనే నినాదాలతో ఆ పోస్టర్లు ఉండడం గమనార్హం. అదే సమయంలో మదురైలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి దారి తీశాయి. ఇక, చర్చల్లేవు...దాడులే అన్న నినాదాలతో అన్నాడీఎంకేకు ఆ పోస్టర్ల ద్వారా హెచ్చరికలు చేశారు. అలాగే, ఈరోడ్‌తో పాటు మరికొన్ని చోట్ల అన్నాడీఎంకే నుంచి తాము కూడా బయటకు వచ్చేశామంటూ కమలనాథులు స్వీట్లు పంచుకోవడం గమనార్హం. అన్నామలై, జయకుమార్ కారణం ఇదేనా..? ఢిల్లీలో జరిగిన భేటీలో పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 20 సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు తెలిసింది. 14 సీట్లు తమకు, మిగిలిన సీట్లు మిత్రులకు తామే పంచే యోచనలో బీజేపీ ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో పుదియ తమిళగం, ఐజేకే, పుదియ నీధి కట్చి, తమిళ మానిల కాంగ్రెస్ ఉన్నాయి. అలాగే తమ శతృవులుగా ఉన్న పన్నీరు సెల్వం శిబిరానికి రెండు , దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు శివగంగై సీటును కట్టబెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. ఇక తాము దూరం పెట్టిన వ్యక్తులను బీజేపీ అక్కున చేర్చుకోబోతుండడాన్ని గ్రహించే, తాజాగా అన్నామలైను టార్గెట్ చేసి కాషాయంతో కటీఫ్ అన్న నినాదాన్ని పళణి శిబిరం అందుకుందనే చర్చ సాగుతోంది. -
‘ఆ సన్నివేశాలు ఎంజీఆర్, జయలలితలను కించపరిచేలా ఉన్నాయి’
‘తలైవి’ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాస్తవిక తప్పిదాలు ఉన్నాయని అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) నేత, మాజీ మంత్రి డి జయకుమార్ పేర్కొన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారం ‘తలైవి’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా శుక్రవారం(సెప్టెంబర్ 10) తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో చెన్నైలో తలైవి మూవీ చూసిన అన్నాడీఎంకే నేత డి జయకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. చదవండి: మరో విషాదం: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తలైవి చిత్రాన్ని ఏఎల్ విజయ్ చాలా చక్కగా తెరకెక్కించారన్నారు. అయితే ఇందులో ఎంజీఆర్, జయలలిత మధ్య జరిగిన కొన్ని సన్నేవేశాల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను తప్పుగా చూపించారని.. ఎంజీఆర్, జయలలితకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వనట్లుగా ఉన్నాయన్నారు. అవి వారిద్దరినీ కించపరిచేలా ఉన్నాయని వెంటనే ఆ సీన్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకులు, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధిగా నాజర్, లీడ్‌రోల్ కంగనా నటించారు. ఈ మేరకు వారిమధ్య జరిగిన కొన్ని సీన్లపై మాజీ మంత్రి జయకుమార్ స్పందించారు. ఎంజీఆర్ తొలి డీఎంకే ప్రభుత్వంలో ఎన్నడూ పదవులు ఆశించలేదన్నారు. చదవండి: చికిత్సకు స్పందిస్తున్న సాయిధరమ్‌తేజ్, బయటకొచ్చిన వీడియో కానీ ఈ చిత్రంలో ఆయన మంత్రి పదవి కోరగా దీనిని అప్పటి డీఎంకే సీఎం అన్నాదురై, ఎం కరుణా నిధిలు అడ్డుకున్నట్లు చూపించారు. ఇది నిజం కాదని, ఎందుకంటే నాటి డీఎంకే సీఎం అన్నాదురై ఎంజీఆర్‌ను మంత్రిని చేయాలనుకున్నారన్నారు. కానీ ఎంజీఆర్ స్వయంగా మంత్రి పదవిని తిరస్కరించారని, దీంతో అన్నాదురై కొత్తగా ఓ శాఖను కేటాయించి దానికి ఆయనను డిప్యూటీ చీఫ్‌గా నియమించారని చెప్పారు. ఇక 1969లో అన్నాదురై మరణించిన అనంతరం సీఎంగా కరుణా నిధి పేరును సూచించింది ఎంజీఆర్యే అని జయకుమార్ వెల్లడించారు. ఆ తరువాత ఎంజీఆర్, కరుణానిధి మధ్య విభేదాలు తలెత్తడంతో 1972లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఎంజీఆర్ సొంతంగా అన్నాడీఏంకే పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. చదవండి: Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ -
'తలా' దర్శకుడి తండ్రి కన్నుమూత
చెన్నై: ప్రముఖ తెలుగు, తమిళ దర్శకుడు శివ తండ్రి జయకుమార్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా వృద్ధాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. జయకుమార్ 400కు పైగా లఘు చిత్రాలకు డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆయన తండ్రి వేలన్ కూడా అనేక సినిమాలకు నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా పని చేశారు. ఇక జయ కుమార్ చిన్నకొడుకు బాలా మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తుండగా పెద్దకొడుకు శివ తొలుత సినిమాటోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో ప్రవేశించారు. (మరో విషాదం : కమెడియన్ కన్నుమూత) తెలుగులో శ్రీరామ్, నేనున్నాను, మనసు మాట వినదు, గౌతమ్ ఎస్ఎస్సీ, బాస్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. తర్వాత గోపీచంద్ శౌర్యం సినిమాతో దర్శకుడిగా మారారు. అలా శంఖం, దరువు సినిమాలను తెరకెక్కించారు. కానీ టాలీవుడ్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీ మీదనే ఫోకస్ పెట్టారు. కార్తీ సిరుతాయ్, తరువాత హీరో అజిత్‌తో వీరం, వేదాళం, వివేగం, విశ్వాసం సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు, ప్రస్తుతం ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రులు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం తమిళనాడు మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఈ భేటీలో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి (మున్సిపల్ అండ్ రూరల్ డెవలప్మెంట్), డి.జయకుమార్ (ఫిషరీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్) పాల్గొన్నారు. -
శృంగార క్యాషియర్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతడి వృత్తి బాధ్యతాయుతమైన బ్యాంకు ఉద్యోగం. ప్రవృత్తి మహిళలను లోబరుచుకుని ఉల్లాసంగా గడపడం. ఒకరు కాదు...ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా మహిళలతో భర్త సాగించిన రాసలీలను ఫొటోలు, వీడియోల ఆధారాలతో తాళి కట్టిన భార్యే బట్టబయలు చేసింది. అరెస్ట్ భయంతో భర్త సహా ఐదుగురి కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే... తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. తంజావూరు జిల్లా వల్లం సమీపం రెడ్డిపాళయానికి చెందిన యువతి (32)తో గత ఏడాది డిసెంబర్ 2వ తేదీన వివాహమైంది. పెళ్లయిన రోజు నుంచే జయకుమార్ తన ఇంటిలోని ప్రత్యేక గదిలో గంటల తరబడి పలువురు మహిళలతో అశ్లీలంగా మాట్లాడడం, తనతో సఖ్యతగా ఉండకపోవడాన్ని భార్య గమనించింది. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో అతని గదిలోకి వెళ్లి పరిశీలించగా 15 సెల్ఫోన్లు, వాటిల్లో జయకుమార్ 40 మందికిపైగా మహిళలతో, బ్యాంకు ఖాతాదారులతో అర్ధనగ్నంగా, నగ్నంగా ఉన్న చిత్రాలు, బాత్రూములో వీడియోలు, ఎస్ఎంఎస్లు చూసింది. ఈ ఘోరాలను తన అత్తగారు, భర్త సోదరి, అత్తవారింటి ఇతర మహిళా బంధువులకు చెప్పుకుని విలపించింది. అయితే వారేమీ పట్టించుకోలేదు. అయితే తన అంతర్గత విషయాలను కుటుంబసభ్యులకు చెప్పిందని జయకుమార్ అగ్రహించి భార్యను తిట్టిపోశాడు. అంతేకాకుండా ‘నీవు స్నానం చేస్తున్నపుడు రహస్యంగా వీడియో తీసి జాగ్రత్తగా దాచిపెట్టాం, ఈ విషయాలు ఎవరికైనా చెబితే ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతాం’ అంటూ జయకుమార్, అతడి సహోద్యోగిని దేవీ బిలోమినా బెదిరించారు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు జయకుమార్‌ను నిలదీశారు. అయితే తన రాసలీలలను బహిర్గతం చేసిందనే కక్షగట్టిన జయకుమార్...భార్యను హతమార్చేందుకు పథకం రచించాడు. ఆలయాల సందర్శన పేరుతో భార్యను బయటకు తీసుకెళ్లి రెండుసార్లు హత్యయత్నం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకుని తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథన్కు ఫిర్యాదు చేసింది. డీజీపీ ఆదేశాల మేరకు బాధితురాలి భర్త జయకుమార్, అతని తల్లి విల్లీ హైడా, సోదరి కేథరిన్ నిర్మలామేరీ, బంధువు రీటాతో పాటుగా, జయకుమార్తో సంబంధం పెట్టుకుని అతడి దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగిని దేవీ బిలోమినాపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన జయకుమార్ మదురై హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తన భర్త రాసలీలలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఆధారాలను మదురై కోర్టుకు అప్పగించి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. బాధితురాలి పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు జామీనుపై విడుదలకు అవకాశం లేని సెక్షన్లతో కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జయకుమార్ సహా ఐదుగురిపై వల్లం మహిళా పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జయకుమార్... కుటుంబంతో కలిసి పరారీలో ఉన్నాడు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ప్రియునితో కలిసి తండ్రిని చంపేసిన బాలిక
పిల్లల బాగు కోసం సర్వస్వం ధారపోసే తండ్రి.. కూతురి ప్రేమపాశానికి రక్తం చిందించాడు. ప్రేమ మత్తులో మానవత్వం మరచిన కూతురు ఎవరూ చేయరాని పని చేసింది. నేటి ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు ఎంత ఘోరంగా దిగజారిపోతున్నాయో, మానవతా విలువలు మృగ్యమవుతున్నాయో ఈ సంఘటన చాటిచెప్పింది. బెంగళూరు: ప్రేమ, దోమ వద్దు, భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, బుద్ధిగా చదువుకో.. అని హితవచనాలు పలికిన తండ్రి ఆ కూతురికి శత్రువులా కనిపించాడు. తండ్రి అన్న ప్రేమ కూడా లేకుండా ప్రియునితో కలిసి దారుణంగా గొంతు కోసి చంపి, ప్రమాదంలా చిత్రీకరించేందుకు పెట్రోల్ పోసి మంట బెట్టిన కూతురి నిర్వాకం తెలిసి బెంగళూరు ఉలిక్కిపడింది. రాజాజినగరలో దుస్తుల వ్యాపారి జయకుమార్ జైన్‌ది అనుమానాస్పద మృతి కాదు, మైనర్ కూతురు, ఆమె ప్రియుడు చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. దీంతో నగరంలోని జైన్ సమాజం తీవ్ర షాక్‌కు గురైంది. రాజాజినగరలో భాష్యం సర్కిల్లో బట్టల షాప్ నడిపే జయకుమార్ జైన్ (41) రాజాజినగర 5వ బ్లాక్ 7వ క్రాస్‌లోని నివాసంలో ఆదివారం ఉదయం మంటల్లో కాలిన స్థితిలో మరణించాడు. విచారణ చేపట్టిన బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్ బృందం కొద్దిగంటల్లోనే అది ప్రమాదం కాదని గుర్తించారు. అతని 15 ఏళ్ల కూతురు, 18 ఏళ్ల బీకాం విద్యార్థి, ప్రియుడు ప్రవీణ్ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేల్చారు. పాలలో నిద్రమాత్రలు కలిపి ఆమె తల్లి, తమ్ముడు శనివారం ఊరికి వెళ్లగా రాత్రికి తండ్రికి నిద్రమాత్రలు కలిపిన పాలను ఇచ్చింది. తాగి మత్తులోకి జారుకోగా ప్రియున్ని పిలిపించి కత్తితో తండ్రి గొంతు కోసి చంపింది. అనంతరం శవాన్ని బెడ్రూంలోంచి బాత్రూంకు తెచ్చి రక్తపు మరకలు పోవాలని కడిగారు. బెడ్రూంలో గోడలపై పడిన రక్తపు మరకలపై నీళ్లు పోసి శుభ్రం చేశారు. అయినా మరకలు పోలేదు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారే వరకు అనేక ప్రయత్నాలు చేశారు. తెల్లవారుజామున పెట్రోలు తెచ్చి మృతదేహం మీద వేసి నిప్పటించారు. ఆ మంటలు తగిలి బాలిక, ప్రవీణ్ కు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రవీణ్ పారిపోగా, బాలిక అగ్నిప్రమాదం జరిగిందని కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. గుట్టు తేల్చిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలంచిన పోలీసులు బాలికను ప్రశ్నించారు. అర్థంకాని మాటలు చెప్పటంతో ఆమె ద్వారా ప్రవీణ్‌ను పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ ఎలా హత్య చేసిందీ వివరించారు. ప్రవీణ్ రాజాజీనగర 20వ మొయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిది కూడా కలిగిన కుటుంబమే అని తెలిసింది. కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగి చనిపోయినట్లుగా చిత్రీకరించాలని ఇద్దరూ ప్రయత్నించారని డీసీపీ శశికుమార్ తెలిపారు. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతుండటం వల్ల ఇద్దరి మధ్య స్నేహం పెరిగిందన్నారు. ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇద్దరి మధ్య ప్రేమకు అడ్డుపడుతున్న తండ్రిని కూతురు, ప్రవీణ్‌లు కలిసి హత్య చేసినట్లు వివరించారు. ఇంట్లో ఉన్న చాకుతో పాటు బయట నుండి తెచ్చిన మరో చాకుతో ఇద్దరు కలిసి హత్య చేశారన్నారు. అందోళనకు గురైన జైన్ సముదాయం బెంగళూరులో అధిక మంది జైన్ సముదాయానికీ చెందిన వారు వ్యాపారాలు చేస్తున్నారు. బట్టల వ్యాపారం చేస్తూ అందరికీ సుపరిచితుడిగా ఉన్న జయకుమార్ హత్యతో జైన్ కుటుంబాలను తీవ్ర దిత్భ్రాంతికి గురయ్యారు. ఒక మైనర్ బాలిక తండ్రిని ఇలా హత్య చేయించిందా అంటూ ముక్కు మీద వేలు వేసుకొంటున్నారు. సమాజానికీ అహింసా మార్గాన్ని చాటే సముదాయంలో ఇలా జరిగిందా? అని పెద్దలు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రాంతంలో ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేదని స్థానికులు తెలిపారు. ఆకస్మికంగా అగ్గి పడిందని తెలిసి తాము ఫైరింజన్‌కు ఫోన్ చేసినట్లు స్థానికులు తెలిపారు. కన్నకూతురే హత్య చేసిందని తెలిసి ఆందోళనకు గురయ్యారు. పిల్లల భవిష్యత్ కోసం చెమటోడ్చే తండ్రిని ప్రేమ పేరుతో ఇలా అంతమొందించడం దారుణమని వాపోయారు. -
యువతితో సంబంధం.. నిజమే !
యువతితో సంబంధం, గర్భం, అబార్షన్ ప్రయత్నం, మగ బిడ్డకు జననం అంటూ రచ్చకెక్కిన ఆడియో వ్యవహారంలో మంత్రిజయకుమార్ చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మీద చర్చకు మహిళా కమిషన్‌లో న్యాయవాది సురేష్ బాబు ఫిర్యాదు చేశారు. మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.ఆడియోలో మాట్లాడింది మంత్రి జయకుమారే అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ స్పష్టం చేశారు. సాక్షి, చెన్నై: ఓ యువతితో ఏర్పడ్డ సంబంధం, ఆమె గర్భం దాల్చడం, అబార్షన్ చేయించేందుకు ప్రయత్నాలు చేయడం, చివరకు ఆ యువతి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టుగా, దీనిని దాచి పెట్టే రీతిలో చేసిన ప్రయత్నాలను వెలుగులోకి తెస్తూ, మంత్రి జయకుమార్‌ను టార్గెట్ చేసిన ఆడియోలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఆడియోలో పేర్కొంటున్న ఆ యువతి బ్రాడ్వేకు చెందినట్టు వెలుగులోకి వచ్చింది. కోవలం నుంచి ఈ ఎపిసోడ్ మొదలైనట్టుగా ప్రచారం ఊపందుకుంది. పూజల పేరిట ఓ స్వామిజీ సాగించిన వ్యవహారం, మోసం, న్యాయం కోసం మంత్రి ఇంటి తలుపులు తట్టడం వంటి పరిణామాలతో ఈ సంబంధం కొనసాగినట్టు ఆరోపణలు, ప్రచారం గుప్పుమంటోంది. ఇది సంబంధం, ఆడియో వ్యవహారం 2016లో సాగినా, ఇన్నాళ్లు దాచి పెట్టి, ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి ఉండటం గమనార్హం. ఆడియోలో ఉన్న గళం తనది కాదని మంత్రి జయకుమార్ పేర్కొంటున్నా, ఆయన విచారణకు సిద్ధం కావాలని, ముందుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే వాళ్లు ఎక్కువయ్యారు. మహిళా కమిషన్‌లో ఫిర్యాదు తనకు ఏ సంబంధం లేదంటూ మంత్రి వివరణ ఇచ్చుకున్నా, ఈ వ్యవహారాన్ని అంత సులభంగా వదలిపెట్టే పరిస్థితుల్లో కొందరు లేనట్టుగా ఉంది. సురేష్ బాబు అనే న్యాయవాది ఏకంగా జాతీయ మహిళా కమిషన్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు వివరణ కోరుతూ ఒకటి రెండు రోజుల్లో మంత్రి జయకుమార్‌కు సమన్లు సైతం జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. దీంతో మంత్రి జయకుమార్‌కు మున్ముందు చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు దినకరన్, సెంథిల్ బాలాజి, తంగ తమిళ్ సెల్వన్ డిమాండ్ చేస్తున్నారు. ఆడియోలో ఉన్న గళం జయకుమార్దే అని స్పష్టం చేస్తున్నారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు కుట్రలు జరిగాయని, దినకరన్ మీద మంత్రి ఆరోపణలు గుప్పించడం మంచి పద్ధతి కాదని తంగతమిళ్ సెల్వన్ హెచ్చరించారు. ఈ ఆడియో వ్యవహారంలో అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉప్పు తిన్న వాడు.. నీళ్లు తాగాల్సిందేనని, ఆ దిశగా మంత్రి తీరు ఉందంటూ దినకరన్ మండిపడ్డారు. ఆడియోలో ఉన్నది ఆయన గళం కానప్పుడు, పదవికి రాజీనామా చేసి, విచారణకు సిద్ధం కావచ్చుగా అని సవాల్ చేశారు. కాగా, సమాచార మంత్రి కడంబూరు రాజు పేర్కొంటూ, పెద్దాయన పేరుకు కళంకం తీసుకొచ్చేందుకే పనిగట్టుకుని ఎవరో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
బీవోబీ చీఫ్ పదవీకాలం పొడిగించే అవకాశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ, సీఈవో పీఎస్ జయకుమార్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన మూడేళ్ల పనితీరును మదింపు చేసిన అనంతరం ఈమేరకు తుది నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లుగా ప్రైవేట్ రంగం నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఇద్దరు ప్రొఫెషనల్స్‌లో జయకుమార్ కూడా ఒకరు. 2015 అక్టోబర్‌లో బీవోబీ సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్ల పదవీకాలం అక్టోబర్ 12తో ముగియనుంది. జయకుమార్ బాధ్యతలు చేపట్టాక 11 త్రైమాసికాల్లో బీవోబీ నికరంగా రూ. 7,092 కోట్ల నష్టాల్ని ప్రకటించింది. -
శిఖాశర్మ స్థానంలో ప్రభుత్వ బ్యాంకర్
న్యూఢిల్లీ : పీఎస్ జయకుమార్.. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈయనే ఇక యాక్సిస్ బ్యాంక్ సీఈవోగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ సీఈవో శిఖా శర్మ స్థానంలో, జయశంకర్ ఆ పదవిని అలంకరించబోతున్నారని తెలుస్తోంది. కొత్త సీఈవోను వెతుకులాడేందుకు బ్యాంక్ అపాయింట్స్‌మెంట్ కమిటీ ఈ ఏడాది ప్రారంభంలోనే ఇగోన్ జెహెండర్ను నియమించింది. జెహెండర్ ఆధ్వర్యంలోని సెర్చ్ ప్యానల్, జయకుమార్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. జయకుమార్ అంతకముందు సిటీబ్యాంకర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం బీఓబీ సీఈవోగా ఉన్నారు. ఈ ఏడాదితో ఆయన పదవీ కాలం బీఓబీలో ముగియబోతోంది. కాగ, శిఖా శర్మ ఈ ఏడాది చివరికి శాశ్వతంగా తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. 2018 సెప్టెంబర్ వరకు యాక్సిస్ బ్యాంక్ కొత్త సీఈవోపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జయకుమార్తో పాటు ఈ పదవికి బ్యాంక్ డిప్యూటీ ఎండీ వీ శ్రీనివాసన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఆనంద్‌లు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను, బోర్డు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయనుంది. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఒక్కసారి సీఈవో ఎవరో తేల్చేశాక, షేర్‌హోల్డర్స్, ఆర్బీఐ నుంచి బ్యాంక్ ఆమోదం పొందుతుంది. కాగ, గతేడాది జూలైలోనే యాక్సిస్ బ్యాంక్, శిఖా శర్మను మరోసారి సీఈవో, ఎండీగా నియమించింది. 2018 జూన్ నుంచి మూడేళ్ల పాటు ఆమెనే కొనసాగనున్నారని పేర్కొంది. అయితే దీనిపై ఆర్బీఐ అభ్యంతరం తెలిపింది. బ్యాంక్ ప్రదర్శన, ఆస్తుల నాణ్యత బట్టి, మరోసారి యాక్సిస్ బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలిపింది. అయితే శిఖా శర్మనే తన నాలుగో టర్మ్ పదవి కాలాన్ని 2021 మే వరకు కాకుండా.. ఈ ఏడాది చివరికి ముగించేయాలని కోరినట్టు బ్యాంక్ బోర్డు, ఆర్బీఐకి లేఖ తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరితోనే శిఖాశర్మ తన పదవి నుంచి దిగిపోబోతున్నారు. -
తూత్తుకుడి హింస.. రాజకీయ దుమారం
సాక్షి, చెన్నై: తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత ఆందోళనల అంశం రాజకీయ మలుపు తీసుకుంది. మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఆంక్షలు విధించి రెచ్చగొట్టారని, పైగా వారిపై అమానుషంగా పొట్టనబెట్టుకున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పటంతోనే పోలీసులు కాల్పులు చేపట్టినట్లు మంత్రి జయకుమార్ వెల్లడించారు. మృతులకు నష్టపరిహారం అందిస్తామన్న ఆయన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ...‘ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిందిపోయి.. ఈ ప్రభుత్వం వారి ప్రాణాలను బలిగొంది. అవినీతిని ప్రొత్సహించటం కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ ఫ్యాక్టరీ మూత పడాల్సిందే. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తూత్తుకుడి పరిస్థితుల నేపథ్యంలో రేపు కర్ణాటకలో జరగబోయే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరు కావటం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు కీలక నేతలతో స్టాలిన్ తూత్తుకుడిలో పర్యటించే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామాలపై నటుడు, మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా స్పందించారు. ‘పౌరుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. వాళ్లేం నేరగాళ్లు కాదు. ప్రజా హక్కులను కాపాడాల్సింది పోయి పొట్టనబెట్టుకుంది. జంతువులను కాల్చి చంపినట్లు చంపారు. శాంతియుత ఆందోళనను హింసాత్మకంగా మార్చింది ప్రభుత్వమే. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపు తూత్తుకుడికి వెళ్తాను. తక్షణమే ఫ్యాక్టరీని మూసేయాలి’ ఆయన డిమాండ్ చేశారు. వివాదం... 1996లో స్టెరిలైట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కాపర్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఈ ఫ్యాక్టరీ మాత్రం రెట్టింపు ఉత్పత్తి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 మార్చిలో వేలాది మంది ప్రజలు ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడ్డ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేయటం, విషపూరిత వాయువుల కారణంగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత వ్యాధులతో వేలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో ఫ్యాక్టరీని మూసేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే నేషన్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలతో తిరిగి ఫ్యాక్టరీ తెరుచుకుంది. అదే ఏడాది ఎడీఎంకే చీఫ్ వైకో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయగా, పర్యావరణానికి, ప్రజలకు చేసిన నష్టానికి 100 కోట్ల జరిమానా విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్ మాత్రం ‘ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు ఎక్కడా ఉల్లంఘించటం లేదు’ అని వాదించి ఆ జరిమానా నుంచి తప్పించుకుంది. అంతేకాదు ఇప్పుడు ఫ్యాక్టరీ మూసివేత డిమాండ్ ఊపందుకున్న వేళ.. తమ ఫ్యాక్టరీ ద్వారా పరోక్షంగా 25 వేల మందికి, ప్రత్యక్షంగా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వాదిస్తోంది. అయితే స్థానిక ప్రజలు ఇది ప్రమాదకరమని, తక్షణమే మూసేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు లైసెన్స్ రెన్యువల్‌కు ఫ్యాక్టరీ యాజమాన్యం యత్నిస్తుందన్న వార్తలు బయటకు పొక్కటంతో ఈ ఆందోళనలు తీవ్ర తరం అయ్యాయి. -
మార్ఫింగ్ ఫోటో.. పోలీసులకు వర్మ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తన ఫోటోను మార్ఫింగ్ చేశాడంటూ రచయిత జయ కుమార్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. నగ్నంగా ఉన్న మహిళ ఫోటోకు తన తలను అంటించి.. ఆ ఫోటోను జయ కుమార్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడంటూ వర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కించిన ఆఫీసర్ తన స్క్రిప్ట్ అంటూ జయకుమార్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తనకు న్యాయం చేయాలంటూ హీరో నాగార్జునను కోరుతూ జయకుమార్ ఓ ట్వీట్ కూడా చేశాడు. కొన్నాళ్ల క్రితం వర్మ, పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో జీఎస్టీ అనే అడల్ట్ చిత్రం తెరకెక్కించగా.. అది కూడా తన కథేనంటూ జయకుమార్ ఆరోపించాడు. జయకుమార్ సర్కార్-3 చిత్రానికి రచనా సహకారం అందించాడు. -
నీలం ట్రైలర్‌పై నిషేధం
తమిళసినిమా: ఉనకుల్ నాన్, లైన్మెన్, బ్యూటిఫుల్ ఐ వంటి చిత్రాలను రూపొందించిన వెంకటేష్ కుమార్ తాజాగా దర్శకత్వం వహించిన కొత్త చిత్ర నీలం. బ్లూవెల్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ ద్వారా ఆయన ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇందులో శ్రీ, పవిత్రా, జగన్, జయకుమార్ వంటి పలువురు నటించారు. సతీష్ చక్రవర్తి సంగీతాన్ని సమకూర్చగా. రామలింగం స్క్రీన్‌ప్లే చేశారు. నీలం చిత్రాన్ని శ్రీలంకలో జరిగిన అంతర్గత పోరు, ఈలం తమిళుల కష్టాలను కళ్లకు కట్టే రీతిలో రూపొందించారు. ఇప్పటికీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ సిద్ధమైంది. దీనిని సెన్సార్ అధికారుల తనిఖీ కోసం పంపారు. ట్రైలర్ తిలకించిన సెన్సార్ బోర్డు సభ్యులు ఇబ్బందికర రీతిలో డైలాగ్‌లు అధికంగా ఉన్నాయన్నారు. దీంతో ట్రైలర్‌కు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయం గురించి చిత్ర దర్శక నిర్మాత వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ నీలం చిత్ర ట్రైలర్‌ను సెన్సార్ బృందం నిరాకరించారని తెలిపారు. ఈ చిత్రం ఈలం తమిళుల నేపథ్యంలో చిత్రీకరించినందున సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. ఇది తన ఐదేళ్ల శ్రమ. ఈ చిత్రం పూర్తిగా తమిళుల కోసం రూపొందించింది. తనకు న్యాయం కావాలని వెంకటేష్ కోరుతున్నారు. -
జాగ్రత్త... ఆయనకు పట్టిన గతే పడుతుంది
సాక్షి, చెన్నై : నూతన రాజకీయ పార్టీతో త్వరలో తమిళ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సీనియర్ నటుడు కమల్ హాసన్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఆయన ప్రభుత్వంపై ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా డెంగ్యూ నివారణలో ఘోరంగా విఫలమైందంటూ విమర్శలు చేయగా, ప్రభుత్వం నుంచి గట్టి కౌంటరే కమల్‌కు పడింది. కేవలం అధికారం కోసమే కమల్ తహ తహలాడుతూ కలలు కంటున్నాడని రాష్ట్ర మంత్రి డీ జయకుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కమల్ వైఖరిని ఎండగట్టారు. ‘రాజకీయాలంటే 100 రోజులు ఆడే సినిమా అని ఆయన (కమల్) అనుకుంటున్నాడేమో. ముఖ్యమంత్రి పదవి అంటే మార్కెట్లో దొరికే బొమ్మ కాదు. ప్రజలు గుర్తించి, వాళ్లు అంగీకరిస్తేనే అధికారం, పదవులు దక్కుతాయి. ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే కాదు’ అని జయకుమార్ అన్నారు. గతంలో ఇలాగే అభిమానులు ఉన్నారు కదా అన్న భరోసాతో నటుడు శివాజీ గణేశన్ రాజకీయాల్లోకి వచ్చి ఘోరంగా దెబ్బతిన్నారని, తొందరపడితే కమల్‌కి కూడా అదే గతి పడుతుందని జయకుమార్ చెప్పారు. నటులు మీటింగ్‌లు పెడితే అభిమానులు లక్షల్లో వస్తారేమో. కానీ, అంతా ఓట్లు వేస్తారన్న గ్యారెంటీ లేదు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల్లోకి వెళ్లాలిగానీ, సోషల్ మీడియాలో కామెంట్లు చేయటం కాదు. ముందు కమల్‌ను పిట్ట కూతలు ఆపి, రాజకీయ పార్టీని స్థాపించమనండి అని జయకుమార్ చురకలంటించారు. శివాజీ ఫెయిల్యూర్ స్టోరీ... ఎంజీఆర్ సమకాలీకుడు అయిన శివాజీ గణేశన్ 1955 లో డీఎంకేకు మద్ధతుదారుడిగా ఉండేవారు. తర్వాత కొంతకాలానికి కామ్రాజ్ విజ్ఞప్తి మేరకు తర్వాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. తర్వాత కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. ఇందిరాగాంధీ అనంతరం ఆయన రాజకీయాలకు దూరంకాగా, తిరిగి 1987లో తమిజగ మున్నేట్ర మున్నాని పేరిట కొత్త పార్టీని స్థాపించి రీఎంట్రీ ఇచ్చారు. రెండేళ్లకే పార్టీని జనతాదళ్ పార్టీలో విలీనం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. హీరోగా అశేష అభిమానం సంపాదించుకున్న ఆయన నేతగా మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. -
‘రాజీవ్ హంతకులను విడుదల చేయవద్దు’
సాక్షి, చెన్నై: ‘పిటిషన్‌దారులు హతమార్చింది సాధారణ వ్యక్తిని కాదు, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని. ఆయన దారుణ హత్య దేశం మొత్తాన్ని కుదిపేసింది. పైగా ఇంతటి ఘోరానికి పాల్పడి యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నా ఏమాత్రం పశ్చాత్తాపం పడని వారిని క్షమించి ముందుగా విడుదల చేయడం సరి కాదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది’. ఈ మేరకు మద్రాసు హైకోర్టులో బుధవారం ఒక పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ హత్యకేసులో వేలూరు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న రాబర్ట్ పయాస్, జయ కుమార్ తమను ముందుగా విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2006లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు సెల్వం, పొన్ కలైయరసన్‌లు విచారిస్తున్నారు. పిటిషన్ దారులను ముందుగా విడుదల చేసేందుకు వీలు లేదు, అలా ముందుగా విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలోనే ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదించింది. ఈ పిటిషన్ న్యాయమూర్తుల ముందుకు బుధవారం మరోసారి విచారణకు రాగా.. తమిళనాడు ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. 2012లో తయారు చేసిన కౌంటర్ పిటిషన్నే మరోసారి దాఖలు చేశారు. అప్పట్లో హోం శాఖ ముఖ్యకార్యదర్శి రాజగోపాల్ పేరుతో దాఖలు చేసిన ఆ పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. యావజ్జీవ శిక్ష ఖైదీలైన రాబర్ట్‌పయాస్, జయకుమార్‌లు 20 ఏళ్లకు పైగా జైలులో ఉన్నారని, అయితే వారిపై రుజువైన హత్యా నేరం చాలా తీవ్రమైందని, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వారి చేతిలో దారుణ హత్యకు గురికావడం దేశం యావత్తును స్తంభింపజేసిందని ఆయన చెప్పారు. ముందస్తు విడుదల కోరుతూ 2006లో వారు చేసిన పిటిషన్‌పై 2007లో విచారణ కమిషన్ ఏర్పాటైందని ఆయన పేర్కొన్నారు. ఈ విచారణ కమిషన్ అన్ని కోణాల్లో విచారణ జరిపిందని అన్నారు. పిటిషన్ దారులు 2009లో జైలులో శాంతి భద్రతల సమస్యలు సృష్టించినట్లుగా విచారణ కమిషన్ సమర్పించిన ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు ఆయన గుర్తు చేశారు. జైలు శిక్షను అనుభవించే సమయంలో వారిలో మానసిక పరివర్తన చోటు చేసుకున్నట్లుగా అధికారులు పేర్కొనలేదు కాబట్టి ముందుగా విడుదల చేయకూడదని అన్నారు. అంతేగాక 2010లో ఏర్పాటైన క్రమశిక్షణ కమిటీ సైతం వీరి విడుదలకు సిఫార్సు చేయలేదని తెలిపారు. అలాగే వీరిని ముందుగా విడుదల చేయొచ్చా? లేదా చేయకూడదా? అనే రీతిలో రాజీవ్‌గాంధీ కుటుంబ సభ్యులెవరు ఉత్తరం రాయలేదని చెప్పారు. ఆయా కారణాల దృష్ట్యా రాబర్ట్ పయాస్, జయ కుమార్‌లను ముందుగా విడుదల చేసేందుకు వీలు లేదని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు కేసుపై విచారణను ఈ నెల18వ తేదీకి వాయిదా వేశారు. -
జేకుమార్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌కు శాట్ ఊరట
♦ ట్రేడింగ్ ఆంక్షలపై స్టే ఉత్తర్వులు ♦ సెప్టెంబర్ 4కి విచారణ వాయిదా ♦ నేటి నుంచి షేర్లలో యథాప్రకారం ట్రేడింగ్ ముంబై: అనుమానాస్పద షెల్ కంపెనీల అభియోగాలతో ట్రేడింగ్‌పరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న జేకుమార్, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌కి కాస్త ఊరట లభించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆంక్షలపై స్టే విధిస్తూ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే సెబీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 4కి వాయిదా వేసింది. తాజా పరిణామంతో ఈ రెండు సంస్థల షేర్లలో శుక్రవారం నుంచి మళ్లీ యథాప్రకారం ట్రేడింగ్ జరగనుంది. ఈ మేరకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ కూడా సర్క్యులర్లు విడుదల చేశాయి. రెండు సంస్థల షేర్లను నిఘా చర్యల (జీఎస్ఎం) పరిధి నుంచి తప్పించనున్నట్లు పేర్కొన్నాయి. 20 శాతం శ్రేణిలో వీటిలో ట్రేడింగ్‌కు అనుమతించనున్నట్లు వివరించాయి. ’అనుమానాస్పద డొల్ల కంపెనీలు’ ఆభియోగాలతో 331 సంస్థల షేర్లలో ట్రేడింగ్‌పై సెబీ ఆగస్టు 7న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోని కొన్ని కంపెనీల్లో దేశ విదేశాలకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా ఉన్నాయి. సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ జేకుమార్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, ప్రకాశ్ ఇండస్ట్రీస్ తమను ఆశ్రయించడంతో శాట్ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. అటు స్టాక్ ఎక్సే్చంజీలు సైతం తమ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించింది. విచారణ లేకుండానే ఆంక్షలు.. ‘పిటీషనర్లు వాదిస్తున్నట్లుగా.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) 2017 జూన్ 9న పంపిన లేఖలో అనుమానాస్పదమైనవిగా భావిస్తున్న 331 కంపెనీలు నిజంగానే డొల్ల కంపెనీలేనా లేక నిఖార్సయినవేనా అన్నది మాత్రమే సెబీ విచారణ జరపాల్సి ఉంది. కానీ ఎలాంటి విచారణ జరపకుండానే సెబీ ఆంక్షల ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది‘ అని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పైగా ఎంసీఏ సూచనలను అమలు చేయడానికి సెబీ దాదాపు రెండు నెలల సమయం తీసుకోవడాన్ని బట్టి చూస్తే.. విచారణ లేకుండానే అత్యవసరంగా ఆదేశాలివ్వాల్సినంత పరిస్థితి కూడా లేదని స్పష్టంగా తెలుస్తోందని శాట్ పేర్కొంది. సదరు కంపెనీల వివరణ కూడా తీసుకున్న సెబీ హోల్‌టైమ్ మెంబరు.. మరింత సమాచారం కావాలని కోరినట్లు తమ దృష్టికి వచ్చినట్లు శాట్ పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో పిటీషనర్ల ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వివరించింది. -
చెర మారేనా?
♦ చిన్నమ్మ చుట్టూ చిక్కులు ♦ జయకుమార్ నోట బహిష్కృత మాట సాక్షి, చెన్నై: లగ్జరీ జీవితం గుట్టురట్టుతో చిన్నమ్మ శశికళను పరప్పన అగ్రహార చెర నుంచి మరో చెరకు మార్చే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమెను చిక్కులు చుట్టుముడుతున్న సమయంలో తమకేంటి సంబంధం అంటూ ఆర్థిక మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. శశికళ, దినకరన్‌లను ఎప్పుడో బహిష్కరించామని, ఇందులో ఎలాంటి మార్పులేదని ఆయన ఆదివారం మీడియ ముందు స్పష్టం చేశారు. తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సెపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూప స్వయంగా వివరాలను బయట పెట్టడం , ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది. ఆదివారం విచారణ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరప్పన అగ్రహార చెరలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగినట్టు విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. అదే సమయంలో డీఐజీ రూప మరో లేఖను విడుదల చేయడంతో చిన్నమ్మను చిక్కులు చుట్టుముట్టాయి. అదే సమయంలో ఆ చెరలో ఉన్న పలువురు ఖైదీలను బళ్లారి చెరకు మార్చడంతో, ఇక చిన్నమ్మ వంతు రానున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆమెను కూడా జైలు మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే, కర్ణాటకలోని మరో జైలుకు మార్చేనా లేదా, మరేదేని కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, చిన్నమ్మను చెన్నై పుళల్‌జైలుకు తీసుకొచ్చే రీతిలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏదేని వ్యూహాన్ని రచించేనా అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆ దిశగా ప్రయత్నాలు అనుమానంగా మారింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆర్థిక మంత్రి జయకుమార్ ఓ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. జయకుమార్ నోట అదే మాట: శశికళ, దినకరన్‌లు జైలుకు వెళ్లిన సమయంలో ఏ›ప్రిల్‌లో మంత్రి వర్గం సమావేశమైనట్టు ఆర్థిక మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. ఇందులో మంత్రులందరూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తూ నిర్ణయాన్ని అప్పట్లో తీసుకున్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత చేతుల మీదుగా మహాశక్తిగా అవతరించిన అన్నాడీఎంకేను రక్షించుకుంటామని, ఎవరి గుప్పెట్లోకి చేరనివ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తామన్నారు. శశికళ, దినకరన్‌లకు పార్టీతో, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని, తామెవ్వరి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా చెర మార్పు విషయంగా స్పందించడం గమనార్హం. అయితే, అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్‌తో పాటు మరికొందరు చిన్నమ్మను చిక్కులు చుట్టు ముట్టడంపై ఆవేదన వ్యక్తం చేయడం ఆలోచించాల్సిందే. -
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
-
తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. మంత్రి రాజీనామా?
అన్నాడీఎంకే రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు విలీనం గురించి రెండు వర్గాల మధ్య చర్చలు సోమవారం మొదలవుతుంటే.. మరోవైపు ఆర్థికమంత్రి డి.జయకుమార్ తాను రాజీనామా చేస్తానంటూ ముందుకొచ్చారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గానికి మంత్రి పదవులు ఇవ్వాలంటే ఇప్పుడున్న మంత్రుల్లో కొంతమంది త్యాగాలు చేయక తప్పదని, ముందుగా తానే త్యాగం చేస్తానని ఆయన చెప్పడం గమనార్హం. పార్టీ సంక్షేమం కోసం తన పదవి పోయినా పర్వాలేదని ఆయన విలేకరులతో చెప్పారు. అయితే, అదే మంత్రివర్గంలోని మరో మంత్రి దిండిగల్ సి శ్రీనివాసన్ మాత్రం మరోరకంగా స్పందించారు. మెజారీటీ ఉన్న ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పూర్తి కాలం పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంత సులభం కాదని తెలుస్తోంది. పన్నీర్ వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ గురించి ఆర్థిక మంత్రి జయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అయితే ఓపీఎస్ వర్గం డిమాండ్లు వినేందుకు సుముఖంగా ఉన్నామని మాత్రం చెప్పారు. వాళ్ల డిమాండ్లు ఏంటో బయటపెట్టాలని, రెండు వైపుల నుంచి కూడా డిమాండ్లు ఉండటం సహజమేనని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జయకుమార్ అన్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, వాళ్లు పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి చర్చలు మొదలుపెడితే అప్పుడు అన్ని విషయాలూ అర్థం అవుతాయని చెప్పారు. పళనిసామి వర్గం ఓ రాజీ ఫార్ములాతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పళనిసామి వర్గానికే ఇవ్వాలని, పన్నీర్ సెల్వానికి ఉపముఖ్యమంత్రి పదవి, పార్టీ కోశాధికారి పదవి ఇస్తామని వాళ్లు ఆఫర్ చేస్తున్నారని సమాచారం. వైద్యలింగాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి, పళనిసామిని ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అన్నాడీఎంకే ఎంపీ ఒకరు అన్నారు. మరోవైపు.. పార్టీకి ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నియమించాలని, వాటిలో రెండు వర్గాలు తలొకటి తీసుకోవచ్చని కూడా పళనిసామి వర్గం చెబుతోంది. ఏది ఏమైనా సాయంత్రానికి మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల తర్వాత పార్టీ కార్యాలయంలో చర్చలు మొదలవుతున్నాయి. రెండు వర్గాలు ఎవరికి వారే డిమాండ్లు తీసుకొచ్చారు. ఒకరికి ప్రభుత్వాన్ని, మరొకరికి పార్టీని అప్పగించాలని మధ్యేమార్గంగా సూచిస్తున్నారు. కొంతమంది మంత్రులపై వేటు వేయాలని కూడా అంటున్నారు. రెండు వర్గాల వెనక బీజేపీ ఉందని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఎటు తిరుగుతాయో ప్రశ్నార్థకంగా ఉంది. -
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
-
అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
తమిళనాట వేడిక్కిన రాజకీయం చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు విలీనం కానున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి చకచకా సాగిన పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. రెండు వర్గాల మధ్య విలీన చర్చలపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం మాట్లాడిన అనంతరం... సోమవారం ఉదయం కేబినెట్ మంత్రులతో సీఎం పళనిస్వామి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాత్రి బాగా పొద్దుపోయాక తమిళనాడు సీనియర్ మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. గ్రీన్‌వేస్ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో చర్చలు కొనసాగాయి. ఈ భేటీలో శశికర, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై చర్చించారు. భేటీ అనంతరం డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన విధివిధానాలు, సమైక్యంగా పార్టీని ముందుకు నడపడంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. విలీనంపై పన్నీర్‌సెల్వం ఆలోచనను భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్వాగతించారని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ వెల్లడించారు. అమ్మ పాలన కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే అందరి అభిప్రాయమన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్ దినకరన్ బెంగళూరులో ఉన్నందున తిరిగివచ్చాక ఈ అంశంపై ఆయనతో చర్చిస్తామని న్యాయ శాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. -
మతం మార్చుకోనన్నాడని ప్రియుడిపై యాసిడ్ దాడి..
బెంగళూరు: బెంగళూరులో ఓ యువతి ప్రేమికుడిపై యాసిడ్ చేసిన ఘటన కలకలం రేపింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తున్న ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఈ దాడికి దిగింది. పథకం ప్రకారం అతణ్ని వెంబడించి మరీ ముఖంపై యాసిడ్ పోసి బ్లేడ తో దాడిచేసి పరారయ్యింది. వివరాల్లోకి వెళితే శ్రీరాంపురా లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లిడియా (26) జయకుమార్ (32)గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహంచేసుకోవాలని అడుగుతూ వచ్చింది లిడియా. అలాగే క్రైస్తవంలోకి మతం మార్చుకోవాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఎట్టకేలకు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినా మతం మార్చుకునేందుకు మత్రం నిరాకరించాడు కుమార్. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో గత నవంబర్ నుంచి జయకుమార్ ఆమె ఫోన్ కాల్స్ కు స్పందించడం మానేసాడు. దీంతో లిడియా ప్రియుడిపై పగ పెంచుకుంది. ఎలాగైనా దెబ్బకొట్టాలనుకుంది. దీనికి కజిన్ సునీల్ సాయం తీసుకుని జయ కుమార్ కదలికలపై కన్నేసింది. జయకుమార్, స్నేహితుడుతో పద్మనాభ రాజరాజేశ్వరి ఆలయానికి వెళుతున్న సమాచారాన్ని తెలసుకుంది. లిడియా, సునీల్ ఇద్దరూ స్కూటర్ మీద మార్గమధ్యలో అతని కోసం కాపు కాచారు. దర్శనం అనంతరం తిరిగి కారులో వస్తున్న జమకుమార్ పై దాడిచేసింది. అట్టిగుప్పబస్సు స్టాప్ దగ్గర వారికిని అటకాయించి..జయకుమార్ ముఖంపై యాసిడ్ పోసింది. బాధతో విలవిల్లాడుతూ కారునుంచి బయటికి వచ్చిన అతనిపై బ్లేడుతో ఎదురుచూస్తున్న లిడియా దాడిచేసి ఉడాయించింది. తీవ్రంగా గాయపడిని కుమార్ ను అతని స్నేహితుడు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదుచేసిన పోలీసులు ఐపీసీ 326ఎ, 307 ఇతర సెక్షన్ల కింద లిడియాను అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన సునీల్ మాత్రం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఇది గాలి కుంటు వ్యాధి కాలం
నేటి నుంచి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు పశుశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్ అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుతం పశువులకు గాలికుంటు వ్యాధి సోకే కాలమని, చికిత్స కన్నా వ్యాధి నివారణే ముఖ్యమని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ కె.జయకుమార్ తెలిపారు. ఈ వ్యాధి నివారణకు ముందస్తుగా ఉచిత టీకాలు కార్యక్రమం నేటి (శనివారం) నుంచి చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన నెల రోజుల పాటు (సెప్టెంబర్ 19వ తేదీ వరకు) 10 లక్షల పశువులకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యాధి లక్షణాలు.. నివారణ మార్గాలను వివరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు : వ్యాధి వ్యాపిస్తే పశువుల్లో మరణాలు తక్కువైనా పాల ఉత్పత్తులు బాగా తగ్గిపోతాయి. ఏవోటీ, ఆసియా–1, ఆసియా–22, ఆసియా–10, పిటార్నో లాంటి వైరస్ వల్ల సోకే ప్రమాదకరమైన అంటు వ్యాధి కావడంతో ఉత్పాదకశక్తి, సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా, బలహీనంగా ఉండే యుక్తవయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్‌కు గురవుతాయి. మేత మేయవు. చొంగకారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. గర్భంతో ఉన్న పశువులు అబార్షన్‌కు గురవుతాయి. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గ్రుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తినడం వల్ల పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి. మంచి ఎద్దులు సైతం వ్యాధి సోకితే బలహీనమై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. నివారణ ఇలా.. : వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్ మందులు తాపించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అÄñæ¬డైజ్డ్ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. ముందస్తు నివారణలో భాగంగా పశుశాఖ ద్వారా ఉచితంగా టీకాలు వేయించుకోవాలి. ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా టీకాలు వేయించుకుంటే మంచిది. -
ఈ అమ్మాయి చాలా గ్రేట్..
మంచానికే పరిమితమైన కవలల్ని వివాహమాడిన యువతులు పెద్దలు కాదన్నా ఒప్పించి మరీ తాళి కట్టించుకున్న వైనం చెన్నై, సాక్షి ప్రతినిధి: అవయవాలన్నీ సక్రమంగా ఉండి, సరైన ఆదాయం ఉంటేనే వివాహమవడం కష్టం. అటువంటిది రెండు దశాబ్దాలుగా పడకకే పరిమితమైన కవలలను ఇద్దరు యువతులు వివాహమాడారు. మానవత్వం చాటారు. జీవితాంతం తోడుంటామని బాస చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా సామియార్ మఠానికి చెందిన జార్జి విలియమ్, అన్నమ్మాళ్ దంపతుల కుమారులైన విజయకుమార్, జయకుమార్ అనారోగ్యంతో పదేళ్ల వయసులోనే మంచం పట్టారు. తల్లిదండ్రులు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం దక్కలేదు. వారిప్పుడు 30 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. 20 ఏళ్లుగా మంచానికే పరిమితమైపోయిన ఆ అన్నదమ్ముల గురించి తెలుసుకున్న కేరళకు చెందిన మంజూష సామియార్ మఠానికి చేరుకుని వారిపట్ల సానుభూతి ప్రకటించింది. అన్నదమ్ముల్లో పెద్దవాడైన విజయకుమార్‌ను 2012లో పెళ్లి చేసుకుంది. తిరునల్వేలి జిల్లా నాంగునేరీకి చెందిన శివకులదేవి సెల్‌ఫోన్ ద్వారా జయకుమార్తో పరిచయం పెంచుకుంది. వీరి పరిచయం క్రమేణా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెద్దలు తొలుత తిరస్కరించినప్పటికీ శివకులదేవి వారిని మెల్లగా ఒప్పించింది. ఈ నెల 22వ తేదీన జయకుమార్ మంచంపై నుంచి లేవలేని స్థితిలోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. -
వరల్డ్ విజన్ ఇండియా బ్లాగథాన్
ఐదేళ్లలోపు చిన్నారులు చాలామందిలో గల పోషకాహార లోపంపై అవగాహన కల్పించేందుకు ‘యూత్ కీ ఆవాజ్’తో కలసి ‘వరల్డ్ విజన్ ఇండియా’ బ్లాగథాన్ ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా తక్కువ బరువు గల ఐదేళ్లలోపు చిన్నారుల్లో నాలుగో వంతు మంది భారత్‌లోనే ఉన్నారని, దేశ జనాభాలో 40 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ‘వరల్డ్ విజన్ ఇండియా’ సీఈవో డాక్టర్ జయకుమార్ క్రిస్టియన్ పేర్కొన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాను.. ముఖ్యంగా బ్లాగులను ఉపయోగించుకోవాలనుకుంటున్నామని, అందుకే బ్లాగథాన్ ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇందులో పాల్గొనే వారు ‘ఆకలి అంటే..’ అనే అంశంపై వీడియో, వ్యాసం, కవిత, డూడుల్ లేదా ఫొటోస్టోరీ వంటివి www.youthkiawaaz.com/hungeris/ వెబ్సైట్లో ఈ నెల 20వ తేదీలోగా పోస్ట్ చేయవచ్చని చెప్పారు. పోస్ట్ చేసిన వాటిలో ఉత్తమ ఎంట్రీలకు ‘మోటో ఈ’ మొబైల్ ఫోన్ బహూకరించనున్నట్లు ప్రకటించారు.