ప్రియునితో కలిసి తండ్రిని చంపేసిన బాలిక | Miner Girl Murder Father In Karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎంత క్రూరం 

Published Tue, Aug 20 2019 9:28 AM | Last Updated on Wed, Aug 21 2019 6:38 PM

Miner Girl Murder Father In Karnataka - Sakshi

పిల్లల బాగు కోసం సర్వస్వం ధారపోసే తండ్రి.. కూతురి ప్రేమపాశానికి రక్తం చిందించాడు. ప్రేమ మత్తులో మానవత్వం మరచిన కూతురు ఎవరూ చేయరాని పని చేసింది. నేటి ఆధునిక ప్రపంచంలో మానవ సంబంధాలు ఎంత ఘోరంగా దిగజారిపోతున్నాయో, మానవతా విలువలు మృగ్యమవుతున్నాయో ఈ సంఘటన చాటిచెప్పింది.
  
బెంగళూరు: ప్రేమ, దోమ వద్దు, భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, బుద్ధిగా చదువుకో.. అని హితవచనాలు పలికిన తండ్రి ఆ కూతురికి శత్రువులా కనిపించాడు. తండ్రి అన్న ప్రేమ కూడా లేకుండా ప్రియునితో కలిసి దారుణంగా గొంతు కోసి చంపి, ప్రమాదంలా చిత్రీకరించేందుకు పెట్రోల్‌ పోసి మంట బెట్టిన కూతురి నిర్వాకం తెలిసి బెంగళూరు ఉలిక్కిపడింది. రాజాజినగరలో దుస్తుల వ్యాపారి జయకుమార్‌ జైన్‌ది అనుమానాస్పద మృతి కాదు, మైనర్‌ కూతురు, ఆమె ప్రియుడు చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. దీంతో నగరంలోని జైన్‌ సమాజం తీవ్ర షాక్‌కు గురైంది. రాజాజినగరలో భాష్యం సర్కిల్‌లో బట్టల షాప్‌ నడిపే జయకుమార్‌ జైన్‌ (41) రాజాజినగర 5వ బ్లాక్‌ 7వ క్రాస్‌లోని నివాసంలో ఆదివారం ఉదయం మంటల్లో కాలిన స్థితిలో మరణించాడు. విచారణ చేపట్టిన బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్‌ బృందం కొద్దిగంటల్లోనే అది ప్రమాదం కాదని గుర్తించారు. అతని 15 ఏళ్ల కూతురు, 18 ఏళ్ల బీకాం విద్యార్థి, ప్రియుడు ప్రవీణ్‌ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తేల్చారు.

పాలలో నిద్రమాత్రలు కలిపి  
ఆమె తల్లి, తమ్ముడు శనివారం ఊరికి వెళ్లగా రాత్రికి తండ్రికి నిద్రమాత్రలు కలిపిన పాలను ఇచ్చింది. తాగి మత్తులోకి జారుకోగా ప్రియున్ని పిలిపించి కత్తితో తండ్రి గొంతు కోసి చంపింది. అనంతరం శవాన్ని బెడ్‌రూంలోంచి బాత్‌రూంకు తెచ్చి  రక్తపు మరకలు పోవాలని కడిగారు. బెడ్‌రూంలో గోడలపై పడిన రక్తపు మరకలపై నీళ్లు పోసి శుభ్రం చేశారు. అయినా మరకలు పోలేదు. రాత్రి 12 గంటల నుండి తెల్లవారే వరకు అనేక ప్రయత్నాలు చేశారు. తెల్లవారుజామున పెట్రోలు తెచ్చి మృతదేహం మీద వేసి నిప్పటించారు. ఆ మంటలు తగిలి బాలిక, ప్రవీణ్‌ కు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రవీణ్‌ పారిపోగా, బాలిక అగ్నిప్రమాదం జరిగిందని కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. 



గుట్టు తేల్చిన పోలీసులు 
ఘటనాస్థలిని పరిశీలంచిన పోలీసులు బాలికను ప్రశ్నించారు. అర్థంకాని మాటలు చెప్పటంతో ఆమె ద్వారా ప్రవీణ్‌ను పిలిపించి అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ ఎలా హత్య చేసిందీ వివరించారు. ప్రవీణ్‌ రాజాజీనగర 20వ మొయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిది కూడా కలిగిన కుటుంబమే అని తెలిసింది. కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం జరిగి చనిపోయినట్లుగా చిత్రీకరించాలని ఇద్దరూ ప్రయత్నించారని డీసీపీ శశికుమార్‌ తెలిపారు. ఇద్దరు ఒకే స్కూల్‌లో చదువుతుండటం వల్ల ఇద్దరి మధ్య స్నేహం పెరిగిందన్నారు. ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ఇద్దరి మధ్య ప్రేమకు అడ్డుపడుతున్న తండ్రిని కూతురు, ప్రవీణ్‌లు కలిసి హత్య చేసినట్లు వివరించారు. ఇంట్లో ఉన్న చాకుతో పాటు బయట నుండి తెచ్చిన మరో చాకుతో ఇద్దరు కలిసి హత్య చేశారన్నారు.
  
అందోళనకు గురైన జైన్‌ సముదాయం 
బెంగళూరులో అధిక మంది జైన్‌ సముదాయానికీ చెందిన వారు వ్యాపారాలు చేస్తున్నారు. బట్టల వ్యాపారం చేస్తూ అందరికీ సుపరిచితుడిగా ఉన్న జయకుమార్‌ హత్యతో జైన్‌ కుటుంబాలను తీవ్ర దిత్భ్రాంతికి గురయ్యారు. ఒక మైనర్‌ బాలిక తండ్రిని ఇలా హత్య చేయించిందా అంటూ ముక్కు మీద వేలు వేసుకొంటున్నారు. సమాజానికీ అహింసా మార్గాన్ని చాటే సముదాయంలో ఇలా జరిగిందా? అని పెద్దలు ఆవేదన చెందుతున్నారు. తమ ప్రాంతంలో ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేదని స్థానికులు తెలిపారు. ఆకస్మికంగా అగ్గి పడిందని తెలిసి తాము ఫైరింజన్‌కు ఫోన్‌ చేసినట్లు స్థానికులు తెలిపారు. కన్నకూతురే హత్య చేసిందని తెలిసి ఆందోళనకు గురయ్యారు. పిల్లల భవిష్యత్‌ కోసం చెమటోడ్చే తండ్రిని ప్రేమ పేరుతో ఇలా అంతమొందించడం దారుణమని వాపోయారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement