
చెర మారేనా?
♦ చిన్నమ్మ చుట్టూ చిక్కులు
♦ జయకుమార్ నోట బహిష్కృత మాట
సాక్షి, చెన్నై:
లగ్జరీ జీవితం గుట్టురట్టుతో చిన్నమ్మ శశికళను పరప్పన అగ్రహార చెర నుంచి మరో చెరకు మార్చే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమెను చిక్కులు చుట్టుముడుతున్న సమయంలో తమకేంటి సంబంధం అంటూ ఆర్థిక మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. శశికళ, దినకరన్‌లను ఎప్పుడో బహిష్కరించామని, ఇందులో ఎలాంటి మార్పులేదని ఆయన ఆదివారం మీడియ ముందు స్పష్టం చేశారు.
తమిళనాడులోనే కాదు, ఎక్కడున్నా, తమ రూటే సెపరేటు అన్నట్టుగా చిన్నమ్మ శశికళ లగ్జరీ వ్యవహారం పరప్పన అగ్రహార చెరలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు రాచమర్యాదలు అందుతున్నట్టుగా వచ్చిన సంకేతాలు కర్ణాటకలోనే, తమిళనాట కూడా రాజకీయంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీగా రూప స్వయంగా వివరాలను బయట పెట్టడం , ఆధారాలు ఉన్నట్టు ప్రకటించడంతో విచారణ కమిషన్ రంగంలోకి దిగింది. ఆదివారం విచారణ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పరప్పన అగ్రహార చెరలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగినట్టు విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం.
అదే సమయంలో డీఐజీ రూప మరో లేఖను విడుదల చేయడంతో చిన్నమ్మను చిక్కులు చుట్టుముట్టాయి. అదే సమయంలో ఆ చెరలో ఉన్న పలువురు ఖైదీలను బళ్లారి చెరకు మార్చడంతో, ఇక చిన్నమ్మ వంతు రానున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆమెను కూడా జైలు మార్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే, కర్ణాటకలోని మరో జైలుకు మార్చేనా లేదా, మరేదేని కీలక నిర్ణయం తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. ఇక, చిన్నమ్మను చెన్నై పుళల్‌జైలుకు తీసుకొచ్చే రీతిలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏదేని వ్యూహాన్ని రచించేనా అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆ దిశగా ప్రయత్నాలు అనుమానంగా మారింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆర్థిక మంత్రి జయకుమార్ ఓ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు.
జయకుమార్ నోట అదే మాట:
శశికళ, దినకరన్‌లు జైలుకు వెళ్లిన సమయంలో ఏ›ప్రిల్‌లో మంత్రి వర్గం సమావేశమైనట్టు ఆర్థిక మంత్రి జయకుమార్ వ్యాఖ్యానించారు. ఇందులో మంత్రులందరూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తూ నిర్ణయాన్ని అప్పట్లో తీసుకున్నామని, ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. దివంగత నేతలు ఎంజీయార్, అమ్మ జయలలిత చేతుల మీదుగా మహాశక్తిగా అవతరించిన అన్నాడీఎంకేను రక్షించుకుంటామని, ఎవరి గుప్పెట్లోకి చేరనివ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తామన్నారు. శశికళ, దినకరన్‌లకు పార్టీతో, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని, తామెవ్వరి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా చెర మార్పు విషయంగా స్పందించడం గమనార్హం. అయితే, అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్‌తో పాటు మరికొందరు చిన్నమ్మను చిక్కులు చుట్టు ముట్టడంపై ఆవేదన వ్యక్తం చేయడం ఆలోచించాల్సిందే.