అన్నాడీఎంకేలో విలీనంపై మంతనాలు
తమిళనాట వేడిక్కిన రాజకీయం
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అన్నాడీంఎకేలోని రెండు చీలిక వర్గాలు విలీనం కానున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి చకచకా సాగిన పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. రెండు వర్గాల మధ్య విలీన చర్చలపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం మాట్లాడిన అనంతరం... సోమవారం ఉదయం కేబినెట్ మంత్రులతో సీఎం పళనిస్వామి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు రాత్రి బాగా పొద్దుపోయాక తమిళనాడు సీనియర్ మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు. గ్రీన్‌వేస్ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో చర్చలు కొనసాగాయి.
ఈ భేటీలో శశికర, పన్నీర్ సెల్వం వర్గాల విలీనంపై చర్చించారు. భేటీ అనంతరం డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన విధివిధానాలు, సమైక్యంగా పార్టీని ముందుకు నడపడంపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. విలీనంపై పన్నీర్‌సెల్వం ఆలోచనను భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలంతా స్వాగతించారని ఆర్థిక శాఖ మంత్రి జయకుమార్ వెల్లడించారు. అమ్మ పాలన కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే అందరి అభిప్రాయమన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్ దినకరన్ బెంగళూరులో ఉన్నందున తిరిగివచ్చాక ఈ అంశంపై ఆయనతో చర్చిస్తామని న్యాయ శాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకు రావాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.